పొగరుబోతు కుక్కపిల్ల

పొగరుబోతు కుక్కపిల్ల

చల్లటి చిరుగాలులు వీస్తున్నవేళ అడవిలోని ఓ పిల్లకుందేలు నది ఒడ్డున కూనిరాగాలు తీస్తూ వెళ్తోంది. పిల్లకుందేలు సంతోషంగా ఉండటం చూడలేని ఓ పిల్లకుక్క ‘భౌ భౌ’ మని మొరుగుతూ కుందేలు చెవిని కొరికింది. పిల్లకుందేలు ఏడుస్తూ ఇంటికి వెళ్ళి అమ్మకుందేలుకి చెప్పింది. ‘‘అయ్యో’’ అని బాధపడిన అమ్మ కుందేలు ఆకు పసరుతో వైద్యం చేసింది. 

వారం రోజుల తర్వాత.... పిల్లకుందేలు నదిలోని నీళ్ళు తాగుతూ ఉంది. అక్కడే ఉన్న పొగరుబోతు పిల్లకుక్క, సమయం చూసి కుందేలు రెండో చెవిని కూడా కొరికింది. విషయం తెలుసుకున్న అమ్మ కుందేలు గబగబా అమ్మ కుక్క దగ్గరికి పరుగెత్తుకెళ్ళింది. “కుక్కకు కూడేస్తే కూటికుండకే ముప్పని పెద్దోళ్లు ఊరకే చెప్పలేదు. ఇంకోసారి ఇలా జరిగితే నేను ఊరుకోను” అని చీవాట్లు పెట్టింది. అమ్మ కుక్క ఏమీ మాట్లాడలేదు. 

మరోవారం తర్వాత పిల్లకుందేలు కళ్ళు మూసుకుని నది ఒడ్డున ఉన్న గడ్డిని ఇష్టంగా తింటోంది. వెనకనే ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చిన పిల్లకుక్క ఎంచక్కా కుందేలు ఎడమ కాలును కొరికింది. ‘‘కుయ్ కుయ్’’ అని అరుస్తూ వెళ్ళి పిల్లకుందేలు తన అమ్మ కుందేలుకు చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా కుక్కకి బుద్ధి రావడంలేదని అమ్మ కుందేలు నేరుగా వెళ్ళి ఏనుగు రాజుకు ఫిర్యాదు చేసింది. ఏనుగు రాజు అప్పటికప్పుడే సమావేశం ఏర్పాటు చేసింది.

‘‘కుందేలు పిల్లను ఎందుకు కొరికావు”అని పిల్ల కుక్కను ఏనుగురాజు గట్టిగా ప్రశ్నించింది. 
‘‘సరదాగా ఉంటుందని కొరికా’’ నిర్లక్ష్యంగా బదులిచ్చింది పిల్లకుక్క. 
దాని సమాధానానికి కోపంతో ఊగిపోయిన ఏనుగు రాజు “అలా చేయడం తప్పని మీ అమ్మ నీకు చెప్పలేదా?” అని అడిగింది.
“నేను కుందేలును కొరికిన ప్రతిసారీ మా అమ్మకి చెప్పాను. మా అమ్మ నవ్వి ఊరుకుంది. కానీ, ఏమీ అనలేదు” అని బదులిచ్చింది. వెంటనే ఏనుగు రాజు అమ్మ కుక్క వైపు తీక్షణంగా చూస్తూ, ‘‘ఎందుకు తప్పని చెప్పలేదు”అని కారణం అడిగింది. 
“నాకు ఉండేది ఒక్కగానొక్క పిల్ల. అలా చేయడం తప్పని చెబితే దాని మనసు బాధ పడుతుందని చెప్పలేదు” అని సమాధానమిచ్చింది. 
“అతి ప్రేమ ఎప్పుడూ పనికిరాదు. ఇలా చేస్తే పిల్ల కుక్క పెద్దయ్యేకొద్దీ దేనికీ పనికిరాకుండా పోతుంది. దాన్ని ముద్దుముద్దుగా చూసుకోవాలని, పూచిక పుల్లంత నొప్పి లేకుండా పెంచాలని చెడ్డ పెంపకం చేశావు. ఈ సంఘటనల్లో నీ తప్పుకూడా ఉంది. కాబట్టి నీకు, నీ పిల్లకుక్కకీ... ఇద్దరికీ శిక్ష విధిస్తున్నా” అని చెప్పింది.
ఏనుగు రాజు ఏమి శిక్ష విధిస్తుందోనని అన్ని జంతువులూ ఆసక్తిగా చూశాయి. 

“మూడు రోజులపాటు మిమ్మల్ని సంఘ బహిష్కరణ చేస్తున్నాను. ఈ మూడురోజులపాటు అడవిలోని ఏ జంతువూ మీతో మాట్లాడదు” అని గంభీరమైన తీర్పు చెప్పింది.
అమ్మకుక్క గజగజ వణికిపోతూ “ఆహారం లేకపోయినా పర్లేదు కానీ, ఎవ్వరూ మాట్లాడకపోతే నాకు ఊపిరి ఆడదు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. పిల్లకుక్కకు నాలుగు బుద్ధిమాటలు చెప్పి బాధ్యతగా మెలిగేటట్లు చేస్తాను” అని వేడుకుంది.

తప్పు తెలుసుకున్న పిల్లకుక్క బాధగా ముఖంపెట్టి కుందేలుకు క్షమాపణలు చెప్పింది. పిల్లకుందేలు కూడా “రాజా, పిల్ల కుక్క తెలియక చేసింది. రోజూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి, అడవిలో ఆడుకోవాలి కదా” అని చెప్పడంతో ఏనుగు రాజు శాంతించింది. పిల్లకుక్క, పిల్లకుందేలు ఎగురుకుంటూ ఆడుకోవడానికి అడవిలోకి పరుగులు తీశాయి.

- ఆర్.సి. కృష్ణస్వామి రాజు