ఆయన అంతిమయాత్ర లైవ్ ను 2.5 మిలియన్ల మంది చూశారు

ఆయన అంతిమయాత్ర లైవ్ ను 2.5 మిలియన్ల మంది చూశారు

అప్పట్లో ఒకడుండేవాడు. అతను గొంతు విప్పితే సంగీతం ఏరులై పారేది.. కాలు కదిపితే వెనకే వందల, వేల పాదాలు నాట్యమాడేవి. అతని పాట వినడం కోసం కోట్లాది ప్రాణాలు లేచి వచ్చేవి. ఇప్పుడతను లేడు. అతని పాట మాత్రం ఉంది. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే.. ఆ పాట మైఖేల్ జాక్సన్ గొంతులో నుంచి వచ్చింది. దిక్కుల్ని దాటి వెళ్లి తన పాటను ప్రపంచ నలుమూల్లోనూ నాటిన ఆ స్వరమాంత్రికుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..

 1958, ఆగస్టు 29న ఇండియానాలో మైఖేల్ జాక్సన్ పుట్టాడు. అతని పూర్తి పేరు మైఖేల్ జోసెఫ్ జాక్సన్. తొమ్మిది మంది పిల్లల్లో ఏడోవాడు. చిన్నప్పటి నుంచే తన అన్నలతో కలిసి వాళ్ల బ్యాండ్‌లో పని చేయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు సోలోగా పాడటం స్టార్ట్ చేశాడు. కన్ను మూసి తెరిచేలోగా స్టార్ అయిపోయాడు. కింగ్ ఆఫ్ పాప్‌గా ఖ్యాతి గడించాడు. అమెరికాలో శ్వేతజాతీయుల అభిమానాన్ని చూరగొన్న మొట్టమొదటి నల్ల జాతీయుడిగా జాక్సన్ పేరు నిలిచిపోయింది. మ్యూజికల్ ఫిల్మ్ ‘ద విజ్‌’లోనూ నటించాడు జాక్సన్.

ఆయనొక రోల్ మోడల్..

జాక్సన్ సింగర్‌‌గా, లిరిసిస్ట్ గానే కాక గొప్ప డ్యాన్సర్ గానూ ప్రపంచప్రఖ్యాతి చెందాడు. ఇన్‌విన్సిబుల్, డేంజరస్, బ్యాడ్, థ్రిల్లర్, మోటౌన్ లాంటి ఆల్బమ్స్ తో ప్రపంచం మొత్తాన్నీ ఊపేశాడు. అతని మూన్ వాక్ స్టైల్ వరల్డ్ ఫేమస్ అయ్యింది. తన ఆల్బమ్స్ లో అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్ థ్రిల్లర్. చాలామంది ఇండియన్ హీరోస్ ఆయన డ్యాన్స్ ని అనుకరించారు. చిరంజీవి సైతం ఓ సినిమాలో జాక్సన్ స్టెప్స్ వేసి అదరగొట్టారు. ప్రభుదేవా అయితే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

జాక్సన్ పాడిన పదమూడు పాటలు అమెరికాలో నంబర్ వన్ స్థానంలో నిలిచాయి. ఆయన సీడీలు ప్రపంచవ్యాప్తంగా ఏడొందల యాభై మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్టు అంచనా. మైఖేల్ మొత్తం పదమూడు గ్రామీ అవార్డులు గెల్చుకున్నాడు. వాటిలో ఎనిమిదింటిని 1984లోనే గెల్చుకోవడం విశేషం.

అందుకే తెల్లగా మారారు...

అందం కోసం, ప్రత్యేక గుర్తింపు కోసం, నీగ్రో అనే ముద్రని చెరిపేసుకోవడం కోసం జాక్సన్ తెల్లగా మారారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జాక్సన్ కి విటిలిగో అనే స్కిన్ డిసీజ్ ఉండేది. దీనివల్ల చర్మంపై తెల్లని మచ్చలు వస్తాయి. పూర్తిగా నయం చేయలేని వ్యాధి ఇది. దాంతో స్పెషల్ మేకప్‌తో దాన్ని కవర్ చేసుకునేవాడు మొదట్లో. రాను రాను సమస్య పెరుగుతుండటంతో కష్టమయ్యింది. ఎందుకొచ్చిన గొడవ అని ట్రీట్‌మెంట్ చేయించుకుని మొత్తం తెల్లగా మారిపోయాడు. 

రేసిజమ్ కి వ్యతిరేకంగా చేసిన ‘బ్లాక్ ఆర్ వైట్’ పాటలో ఒక ఒడిస్సీ డ్యాన్సర్ జాక్సన్ తో కలిసి స్టెప్పులేసింది. ఆ క్లిప్ ఇరవయ్యొక్క సెకన్లు మాత్రమే ఉంటుంది. అందులో తాజ్‌మహల్ కనిపిస్తుంది. ఇది జాక్సన్ పై ఇండియన్స్ కి మరింత ప్రేమ పెంచింది. శివసేన ఆహ్వానించడంతో 1996లో జాక్సన్ ముంబై కూడా వచ్చాడు. ఎయిర్‌‌పోర్ట్ లో అతనికి సోనాలీ బింద్రే స్వాగతం చెప్పింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ నుంచి కూడా ఎంతోమంది సెలెబ్రిటీలు వెళ్లి అతనిని ప్రత్యేకంగా కలిశారు.

2001లో జాక్సన్ తో కలిసి రెహమాన్ ‘ఏకం సత్యం’ పేరుతో ఓ పాటను ట్యూన్ చేశారు. ఇది సగం ఇంగ్లీష్‌లో, సగం సంస్కృతంలో ఉంటుంది. ఇద్దరూ కలిసి పాడారు. అయితే ఆ తర్వాత రెహమాన్‌తో మరో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేశాడు జాక్సన్. ఆఫ్రికాలోని పిల్లల అభివృద్ధి కోసం ఫండ్స్ రెయిజ్ చేసేందుకు గాను ఆ ఆల్బమ్ చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. 

మేఖేల్ జైలుకీ వెళ్లారు.. ఎందుకంటే..

శాంటా బార్బరాకి దగ్గర్లో రెండు వేల ఏడొందల ఎకరాల్లో తన ఇంటిని నిర్మించుకున్నాడు జాక్సన్. అంటే ఇది మన రామోజీ ఫిల్మ్ సిటీ కంటే పెద్దది. ఇందులో జూ, అందమైన గార్డెన్, పెద్ద పెద్ద థియేటర్లు ఉంటాయి. చిన్నపిల్లలు విహార యాత్రలకు ఇక్కడికి రావొచ్చు. క్యాన్సర్ తో బాధపడే చిన్నారులు ఇక్కడికొచ్చి సేదతీరొచ్చు. వాళ్లందరికీ ఉచిత ఆహ్వానం కల్పించేవాడు. వాళ్లతో కలిసి ఆడి పాడేవాడు. చిన్నతనంలో తన తండ్రి పెట్టిన చిత్రహింసల్ని మర్చిపోలేకపోయిన జాక్సన్.. తనలా ఏ చిన్నారీ బాధపడకూడదని, వారి ఆనందం కోసమే ఇలా చేస్తున్నానని చెప్పేవాడు. అయితే చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇదే విషయంలో ఒకసారి రెండు రోజులు జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. దాంతో అతని ఇంట్లోకి పిల్లల్ని వెళ్లనివ్వకుండా కండిషన్లు పెట్టారు పోలీసులు. 

జాక్సన్ సోషల్‌ సర్వీన్ కూడా బాగా చేసేవాడు. భారీగా విరాళాలిచ్చేవాడు. ముఖ్యంగా పేద చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలకు అండగా నిలబడేవాడు. ఎన్నో చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. హెచ్‌ఐవీని అరికట్టే విషయంలో చేసిన కృషికి కారణంగా రోనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మానవతా పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. 

వార్డ్ కి అతనిపేరే...

ఓ యాడ్‌లో నటిస్తున్నప్పుడు పొరపాటున జాక్సన్ జుట్టుకి నిప్పంటుకుంది. మాడు సైతం కొద్దిగా కాలింది. దాని కోసం సర్జరీ చేయాల్సి వచ్చింది. కంపెనీ ఆయనకి భారీ మొత్తంలో నష్ట పరిహారం చెల్లించడంతో కోర్టు బయటే సమస్య పరిష్కారమయ్యింది. అయితే తనకి ట్రీట్‌మెంట్ ఇచ్చిన బ్రాట్‌మేన్ మెడికల్ సెంటర్ సర్వీసెస్‌కి ఇంప్రెస్ అయిన జాక్సన్.. ఆ సెంటర్‌‌కి 1.5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతో బర్న్స్ వార్డ్ కి అతని పేరే పెట్టింది మెడికల్ సెంటర్ యాజమాన్యం.

నైన్టీస్‌లో మార్వెల్ కామిక్స్ ని కొనాలని జాక్సన్ అనుకున్నాడు. ఎందుకంటే అతనికి స్పైడర్‌‌ మేన్‌గా నటించాలనే కోరిక ఉండేది. తానే నటిస్తూ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఎక్స్మెన్ మూవీ తీస్తున్నారని తెలిసినప్పుడు అందులోని ప్రొఫెసర్ ఎక్స్ పాత్రని పోషించాలని కూడా ఆశపడ్డాడు. కానీ వీలు కాలేదు. 

జంతువులంటే ప్రాణం....

జాక్సన్ కి పెట్స్ అంటే కూడా చాలా ఇష్టం. అతని దగ్గర ఓ చింపాంజీ ఉండేది. పేరు బబుల్స్. అదంటే అతనికి ప్రాణం. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర తినేవారు. అతని రూమ్‌లోనే ఓ ఉయ్యాలలో అది పడుకునేది. అతని దగ్గర మూన్‌వాక్ కూడా నేర్చుకుంది. అతనెక్కడికి వెళ్లినా వెంటే ఉండేది. అయితే వయసు పెరిగేకొద్దీ కాస్త వయొలెంట్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎక్కడ తన కొడుకుని గాయపరుస్తుందోననే భయంతో దాన్ని ఓ శాంక్చ్యురీకి ఇచ్చేశాడు జాక్సన్. కానీ దాన్ని తలచకుని చాలాసార్లు బాధపడేవాడు. జాక్సన్ కి దూరంగా ఉండలేక అది కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెబుతుంటారు. 

1992లో జాక్సన్ ఆఫ్రికా వెస్ట్ కోస్ట్ కి వెళ్లాడు. అక్కడివారు అతనికి ఘన స్వాగతం పలికారు. ఐవరీ కోస్ట్ జాక్సన్ కి బాగా నచ్చింది. అక్కడ చాలా హ్యాపీగా గడిపాడు. స్థానికులు కూడా జాక్సన్ ని చాలా ఇష్టపడి అతనిని తమ రాజుగా ప్రకటించారు. ఓ పెద్ద వేడుక కూడా నిర్వహించారు. అతడే రాజు అని నిర్థారించేలా అఫీషియల్‌ పేపర్స్ మీద సంతకం పెట్టించి రిజిస్టర్ చేశారు. చనిపోయేవరకు కూడా ఐవరీ కోస్ట్ కి జాక్సనే అధికారిక రాజు. అతను చనిపోయాక తమ దగ్గరే సమాధి చేస్తాం, బాడీ ఇవ్వమని కూడా వాళ్లు అడిగారు. కానీ అందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం నిరాకరించింది. 

డ్రగ్సే.. మృతికి కారణం..

ఎందుకొచ్చిందో తెలీదు కానీ.. మైఖేల్‌కి చావుమీద చెప్పలేనంత భయం పుట్టుకొచ్చింది. తనకి ఎప్పుడేమవుతుందోనని తెగ టెన్షన్ పడేవాడు. మాస్క్ తీసేవాడు కాదు. నిమిష నిమిషానికీ శానిటైజ్ చేసుకోకుండా ఉండేవాడు కాదు. ఇంట్లో పన్నెండుమంది డాక్టర్లు ఉండేవారు. వాళ్లు ప్రతిరోజూ ఆయన్ని పై నుంచి కింది దాకా పరీక్షించేవారు. ఓ పదిహేను మంది ట్రైనర్లు ఆయన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేవారు. మైఖేల్ ఏం తినాలన్నా ముందు అది ల్యాబ్‌కి వెళ్లేది. పరీక్షలు అయ్యాక, అందులో ఏమీ కలవలేదని రూఢీ అయ్యాకే అది ఆయన కడుపులోకి పోయేది. ఆక్సిజన్‌తో నిండిన రూమ్‌ని తయారుచేసుకుని అందులోనే పడుకునేవాడు. ఆయన పడుకునే మంచానికి ఓ యంత్రం ఉండేది. అది ఆయన పీల్చుకునే గాలి పరిమాణాన్ని కూడా కంట్రోల్ చేసేది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ అవయవమైనా పాడైపోతే వెంటనే మార్చేసేందుకుగాను బోలెడంతమంది అవయవదాతలు ఉండేవారు. వాళ్లందరితో అగ్రిమెంట్లు చేసుకుని, నెలనెలా జీతాలు ఇచ్చేవాడు. ఇలా పాతికేళ్ల పాటు అతి జాగ్రత్తగా బతికాడు. అయినా ఫలితం లేకపోయింది. 2009లో, యాభయ్యేళ్ల వయసులో మైఖేల్‌ని మృత్యువు కబళించింది. అది మర్డర్ అని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో రెండుసార్లు పోస్ట్ మార్టం చేశారు. ఆయన శరీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయని తెలిసింది కానీ ఆయనే తీసుకున్నాడా లేదంటే ఎవరైనా ఇచ్చారా అనేది ప్రూవ్ చేయలేకపోయారు. 

ముందే చెప్పాడు.... 

నిజానికి మైఖేల్ తన మరణం గురించి చాలా యేళ్ల క్రితమే మాట్లాడాడు. అతని మొదటి భార్య పేరు లీసా. ఫేమస్ రాక్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ కూతురామె. తనకి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడే ప్రెస్లీ హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ప్రొపొఫోల్, బెన్జోడయాజెపైన్ లాంటి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్లే గుండెపోటుకి గురయ్యాడని డాక్టర్లు తేల్చారు. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి చెప్పాడు జాక్సన్. నా ఆరోగ్యం కోసం కొన్ని మందులు వాడుతున్నాను, అవి కనుక వికటించాయంటే వీళ్ల నాన్నలాగే గుండెపోటుతో చనిపోతాను అని చెప్పాడు. చివరికి అదే జరిగింది. జాక్సన్ చనిపోయినప్పుడు ఆయన శరీరంలో భారీ మోతాదులో ఉన్నవి ఎల్విస్ ప్రెస్లీ వాడిన డ్రగ్సే. 

చివరి కచేరీ అదే...

ఆ యేడు మార్చ్ నెలలో ఓ కచేరి చేసిన జాక్సన్.. తాను చేసే చివరి కచేరీ ఇదేనని అన్నాడు. ఎందుకలా అన్నాడో తెలీదు కానీ.. మూడు నెలలు తిరిగే లోపే చనిపోయాడు. అతని అంతిమయాత్రని ప్రత్యక్ష ప్రసారం చేస్తే 2.5 మిలియన్ల మంది చూశారు.  ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా ఎవరి అంతిమయాత్రకీ ఇంతమంది వీక్షకులు లేరు. ఆ ఘనత జాక్సన్ కి మాత్రమే దక్కింది. మరో విశేషమేమిటంటే.. ఆయన మృతికి ప్రపంచమంతా రకరకాల పద్ధతుల్లో సంతాపం తెలిపింది. ఆ రోజున (జూన్ 25, 2009), మూడు గంటల పదిహేను నిమిషాలకు.. వికీపీడియా, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ కాసేపు పని చేయడం మానేసి మరీ జాక్సన్‌కి అంజలి ఘటించాయి.