ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రత్యేక టూరిజం కిట్‌ను రూపొందించినట్లు కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో కలిసి టూరిజం కిట్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల విశిష్టతను చాటిచెప్పేలా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కిట్‌ను అత్యంత ఆకర్షణీయంగా రూపొందించినట్లు చెప్పారు.
పర్యాటక రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన జిల్లా టూరిజం బుక్, పెన్ను, పేపర్ వెయిట్, కీ చైన్‌లతో పాటు టీ కప్పులపై ఉపయోగించే ప్రత్యేక కవర్లను ఈ కిట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా పర్యాటక శాఖాధికారి రవికుమార్, డీఆర్డీవో రవీందర్, డీఎంహెచ్ వో నరేందర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
