
-
జర్నలిస్టుల ఆరోగ్య బీమా, వార్షిక అవార్డులపైనా అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్లో జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు.
ఈ సమావేశంలో అక్రిడిటేషన్ పాలసీ, జర్నలిస్టుల ఆరోగ్య బీమా, వార్షిక అవార్డులు, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీ వంటి కీలక అంశాలపై చర్చించారు. అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి తక్షణమే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
అక్రిడిటేషన్ జారీకి విధివిధానాలు సిద్ధం చేయాలని సూచించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా హైపవర్ కమిటీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు జీఓ జారీ చేసిందని.. కానీ, తెలంగాణ వచ్చాక దాని ఊసే ఎత్తలేదని విమర్శించారు. జర్నలిస్టుల వేతనాల పెంపు, ఇతర భత్యాలపై చర్చించడానికి త్రైపాక్షిక కమిటీని కూడా తిరిగి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీలో భాగంగా ఇన్సూరెన్స్ పాలసీ చేయడమా? ఆరోగ్య శ్రీ నుంచి అమలు చేయడమా? జర్నలిస్టులకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
జర్నలిస్టులకు అవార్డులను పునరుద్ధరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్‌వో జీ మల్సూర్‌తో పాటు ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ పాల్గొన్నారు.