సహాయక చర్యలు వేగవంతం చేయండి

సహాయక చర్యలు వేగవంతం చేయండి
  • ​​​ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో మినిస్టర్​ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​తోపాటు భారీ వర్షాలు కురిసిన అన్ని ప్రాంతాల్లోనూ సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. వానలు ఇట్లనే కొనసాగినట్లయితే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రోడ్లకు వెంటనే రిపేర్లు చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున జీహెచ్ఎంసీతోపాటు పలు పట్టణాల్లోని పరిస్థితులపై బుధవారం మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్​ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లోని కల్వర్టులు, బ్రిడ్జిలపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, పోలీసు, రెవెన్యూ, విద్యుత్తు, సాగునీటి శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ‘‘హైదరాబాద్ జలమండలి అధికారులు వరద నివారణ చర్యలు తీసుకోవాలి. కంట్రోల్ రూమ్​లను ఉపయోగించుకోవాలి” అని కేటీఆర్​ సూచించారు.