పొట్ట కూటికోసం ఫుడ్ డెలివరీ.. BMW కారు భీబత్సంతో స్విగ్గీ పార్ట్నర్ స్పాట్ డెడ్..

పొట్ట కూటికోసం ఫుడ్ డెలివరీ.. BMW కారు భీబత్సంతో స్విగ్గీ పార్ట్నర్ స్పాట్ డెడ్..

జీవనోపాధి కోసం అర్ధరాత్రి కూడా పనిచేస్తుంటారు గిగ్ వర్కర్లు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ అందించేందుకు వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ ప్రాణాన్ని.. అతివేగంగా వచ్చిన ఒక విలాసవంతమైన కారు రూపంలో మృత్యువు కబళించిన ఘటన అందరి గుండెను పిండేస్తోంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాకు చెందిన ఖుష్మీత్ రావత్ అనే యువకుడు బ్రతుకుదెరువు కోసం చండీగఢ్‌కు వలస వచ్చాడు. స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో.. సెక్టార్ 35లో ఒక ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు తన బైక్‌పై వెళ్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక BMW కారు అతడి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగం ఎంతటి ఘోరమైనదంటే.. ఢీకొన్న ధాటికి ఖుష్మీత్ గాలిలోకి ఎగిరి కొన్ని మీటర్ల దూరంలో రోడ్డుపై పడిపోయాడు. తల నేలకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం అనంతరం ఖుష్మీత్ మృతదేహాన్ని చూసి అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కష్టపడి పని చేస్తూ.. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా అచేతనంగా పడి ఉండటం చూసి ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కారు అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు, ఆ వాహనం అప్పటికే వేరొకరికి అమ్మేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు.