డివైడర్ ను దాటొచ్చి స్కూటీని ఢీకొట్టిన టిప్పర్

డివైడర్ ను దాటొచ్చి స్కూటీని ఢీకొట్టిన టిప్పర్
  • తీవ్రగాయాలతో యువకుడు స్పాట్ డెడ్

హసన్ పర్తి, వెలుగు: అతివేగంతో వచ్చిన టిప్పర్ డివైడర్ దాటి వెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఓ యువకుడు స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన హసన్ పర్తి పీఎస్ పరిధి నిరూప్ నగర్ తండా మూలమలుపు వద్ద మంగళవారం జరిగింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన పంజాల భూపాల్-నాగలక్ష్మి దంపతుల చిన్నకొడుకు బిట్టు అలియాస్ చరిత్ (27) స్థానికంగా టెంట్ హౌజ్ నడిపించేవాడు. మంగళవారం ఉదయం దేవన్నపేట నుంచి నిరూప్ నగర్ తండాకు స్కూటీపై వెళ్తుండగా, టీజీ 25 టీ0799 నెంబర్ గల టిప్పర్ లారీ తండా వైపు నుంచి వస్తోంది.

ఓవర్ స్పీడ్ తో వచ్చిన టిప్పర్ తండా మూలమలుపు వద్ద డివైడర్ దాటి అవతలి వైపు దూసుకెళ్లింది. డివైడర్ మధ్యలో ఉన్న మూడు కరెంట్ పోల్స్ ను గుద్ది అవతలి వైపు స్కూటీపై వస్తున్న బిట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిట్టు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి భూపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు హసన్ పర్తి పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే ప్రమాదం జరిగిన అనంతరం అటుగా వెళ్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఘటనాస్థలం వద్ద ఆగారు. ప్రమాదానికి గల కారణాలకు అక్కడున్న పోలీస్ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు సూచించారు.

ఒకేచోట 8 మంది డెత్..

నిరూప్ నగర్ తండా సమీపంలోని మూలమలుపు మృత్యు కుహరంగా మారింది. అక్కడ ఈ ఏడాది ఫిబ్రవరి 5న మాచర్ల రాజు, మార్చి 4న తడుగుల రవి, జూన్ 8న పెద్ది సంపత్ రెడ్డి, అంతకుముందు నాగపురి మహేశ్, ఇలా మరో నలుగురు యువకులు కూడా చనిపోయారు. ఇప్పటివరకు ఒకే స్పాట్ లో 8 మంది చనిపోయినప్పటికీ ప్రమాదాల నివారణకు కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.