జనంపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది మృతి

జనంపైకి దూసుకెళ్లిన ట్రక్.. 12 మంది మృతి

బీహార్ లోని వైశాలి జిల్లా నయాగావ్ గ్రామం పరిధిలోని మెహ్నార్ – హాజీపూర్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక పూజల కోసం గుమిగూడిన గ్రామస్తులపైకి.. వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకువెళ్లింది. 9 మంది అక్కడికక్కడే చనిపోగా,  హాస్పిటల్ కు తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12కు పెరిగింది. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబతున్నారు.  డ్రైవర్ మద్యం మత్తులో ట్రక్  నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ట్రక్ జనాలపైకి దూసుకెళ్లిన తర్వాత చెట్టుకు ఢీ కొట్టిందని తెలిపారు. డ్రైవర్ ట్రక్ లో ఇరుక్కుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రమాద ఘటన పై సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి సరైన ట్రీట్మెంట్ అందించాలని ఆదేశాలిచ్చారు.