మహిళా శక్తి చీరల తయారీ స్పీడప్.. సిరిసిల్లలో రెండు షిఫ్ట్‎ల్లో ఉత్పత్తి

 మహిళా శక్తి చీరల తయారీ స్పీడప్.. సిరిసిల్లలో రెండు షిఫ్ట్‎ల్లో ఉత్పత్తి
  • 5వేల సాంచాలపై 
  • 50 లక్షల మీటర్ల క్లాత్ కంప్లీట్
  • మరో 10 వేల మగ్గాలపై తయారీకి ఆఫీసర్ల చర్యలు 
  • పంద్రాగస్టుకు చీరల పంపిణీకి రాష్ట్ర సర్కార్ కసరత్తు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ కింద మహిళా సంఘాలకు అందించే చీరల తయారీ స్పీడందుకుంది. సిరిసిల్లలోని నేతన్నల సాంచాలపై రాత్రి, పగలు రెండు షిఫ్ట్ ల్లో రోజుకు 2.75 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేస్తుండగా.. నెలకు 71.50 లక్షల మీటర్లు తయారవుతోంది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం 4.24 కోట్ల మీటర్ల క్లాత్ తయారీకి ఆర్డర్‎లు ఇచ్చింది. కాగా.. కార్మికుల కూలీ రేటు ఖరారు కాకపోవడంతో రెండు నెలలు ఉత్పత్తి చేపట్టలేదు. గత మే లో కన్ఫర్మ్  చేయడంతో జూన్‌ నుంచి చీరల తయారీ షురూ చేశారు. వచ్చే ఆగస్ట్‌15 నాటికి మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తోంది.  

గడువులోగా కంప్లీట్ చేసేందుకు.. 

రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు1.30 కోట్ల చీరలు తయారీకి  ఆదేశించింది. దీంతో 5,500 మరమగ్గాలపై తయారీ  చేపట్టారు.  ఇప్పటికే 50 లక్షల మీటర్లు పూర్తి చేశారు. వచ్చే వారం రోజుల్లో మరో 10 వేల సాంచాలపై తయారీ ప్రారంభిస్తామని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. మొత్తంగా15 వేలకు పైగా సాంచాలపై తయారు చేపడితే గడువులోగా కంప్లీట్ అవుతుందని అంచనా వేశారు. 

యార్న్ బ్యాంక్ ఏర్పాటు ద్వారా.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్ల నేతన్నల చిరకాల స్వప్నమైన యార్న్​బ్యాంక్‎ను సర్కార్ మంజూరు చేసింది. దీన్ని వేములవాడలో రూ. 50 కోట్లతో ఏర్పాటు చేసింది. దీంతో నేతన్నలకు యార్న్​కొనుగోలు చేయాల్సిన పని తప్పింది. ప్రభుత్వమే సరఫరా చేయడంతో ఉత్పత్తి సులువైంది.  గతంలో బతుకమ్మ చీరలకు వస్త్ర ఉత్పత్తిదారులే యార్న్​కొని కార్మికులకు ఇచ్చేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది.  

గత సర్కార్ తీరుతో కార్మికుల కొరత

సిరిసిల్లలో కార్మికుల కొరత తలెత్తింది. గత సర్కార్ బతుకమ్మ చీరలను తయారు చేయించి.. రూ. కోట్లలో బకాయి పెట్టింది. దీంతో నేతన్నలు అప్పుల్లో కూరుకుపోయారు. చాలా మంది పని మానేసి ఇతర పనుల్లోకి వెళ్లిపోయారు. తద్వారా ఇప్పుడు వస్త్ర తయారీలో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో ఆసాములు ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 

బిహార్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మహారా ష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్  నుంచి వచ్చిన కూలీలు సిరిసిల్లలో పని చేస్తున్నారు. మరో వైపు  ఏడాదంతా పని కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చినందుకు కార్మికుల కొరత ఏర్పడటం ఆసాములను ఆందోళనకు కలిగిస్తోంది.  సిరిసిల్లలో 22 వేల సాంచాలు ఉండగా వీటిపై దాదాపు 5 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు.