రాజ్యాంగ స్ఫూర్తి మరింత విస్తరించాలె : బీఎస్ రాములు

రాజ్యాంగ స్ఫూర్తి మరింత విస్తరించాలె : బీఎస్ రాములు

హోంరూల్ కొంత కాలం నడిచింది. రెండవ ప్రపంచ యుద్దంలో సహకరిస్తే స్వాతంత్య్ర ఇస్తామని బ్రిటిష్ పాలకులు ప్రకటించారు. దాంతో వేలాది మంది భారతీయులు బ్రిటిష్ సైన్యంలో చేరి ప్రాణాలర్పించారు. మరోవైపు సుభాష్ చంద్ర బోస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి జర్మన్ హిట్లర్ సహాయం తీసుకొని ఉద్యమించారు. వందలాది గిరిజన తిరుగుబాట్లు జరిగాయి. ఆ క్రమంలో 1935 లో  రాజ్యాంగం ఏర్పడింది. కొంత పన్ను కట్టేవారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఇచ్చారు. దాని ప్రకారం 1950 దాకా ఎన్నికలు జరుగుతూ ప్రభుత్వాలు నడుస్తూ వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసి బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇండియాకు స్వాతంత్ర్యం ప్రకటించారు. అంతకు ఒక రోజు ముందు పాకిస్తాన్ ఏర్పరచి స్వాతంత్ర్యం ఇచ్చారు. ప్రజలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారడంలో 20 లక్షల మంది చనిపోయారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రాతినిధ్యాల్లో వైఫల్యాలు

1950 జనవరి 26 నుండి ప్రజల సార్వత్రిక ఓటు హక్కుతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. చట్ట సభలు  ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అమలు చేస్తారు. ఇవి రాజ్యాంగ లక్ష్యాలకనుగుణంగా పని చేస్తున్నాయో లేదోనని న్యాయ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.  ఇలా చట్ట సభల కన్నా న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనదిగా రాసుకున్నాము. అయితే ప్రజలు అంతకన్నా అత్యున్నతమైన వారు. తీర్పులను, న్యాయమూర్తులను గౌరవించాలి అంటారు. తీర్పులు న్యాయ మూర్తులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలు కొన్ని సామాజిక వర్గాలకు పరిమితం కావడం సామాజిక న్యాయం చేకూర్చదు. బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో, పరిపాలన వ్యవస్థలో, సైన్యంలో, న్యాయవ్యవస్థలో, ప్రాతినిధ్యం కల్పించలేని చట్ట సభలు సామాజిక న్యాయ సాధనలో విఫలమవుతున్నాయి. సామాజిక న్యాయం, సామాజిక వర్గాలు, వైవిధ్యం, డైవర్సిటీ ప్రాతినిధ్యం అమలైనపుడే .. గణతంత్ర దినోత్సవానికి సార్థకత. యూరప్, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ ల జనాభా ప్రజా ప్రాతినిధ్యం ప్రకారం చూస్తే ఇపుడు భారతదేశంలో లోక్​సభ సభ్యులు 3200 మంది ఉండాలి. తద్వారా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కూడా సులభమవుతుంది. 

మూడింట ఒక వంతు ప్రజాస్వామ్యం

భారత రాజ్యాంగానికి మూడు ముఖ్యఅంగాలు 1.చట్టసభలు 2.పరిపాలన వ్యవస్థ, 3.న్యాయవ్యవస్థ.  ప్రస్తుతం చట్ట సభలలోనే ప్రజల ప్రాతినిధ్యం ఉంది. మిగతా రెండింటిలో కూడా ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ప్రజా ప్రాతినిధ్యం కలిగించినపుడే నిజమైన ప్రజాస్వామ్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్వేచ్చ సమానత్వం తో కుల మత వర్ణ వర్గ లింగ వివక్ష లేకుండా అందరికీ విద్య ఉద్యోగం ఉపాధి నైపుణ్యాలు లభించే సమగ్ర సామాజిక వికాసం జరగాలి.  ఏ ఏ సామాజిక వర్గాలు వెనకబడిపోతున్నారో జనాభా లెక్కల ద్వారా, బీసీ, ఎస్సీ,ఎస్టీ  కమిషన్లు నిరంతరం తులనాత్మక అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు సూచనలతో నివేదికలివ్వడం , ప్రభుత్వాలు ఆమోదించి అమలు చేయడం జరగాలి. 1932 లో ఎస్సీ రిజర్వేషన్ అంబేద్కర్ కృషి వల్ల అమలులోకి వచ్చాయి. కాని అదే కాలం నుంచి అమలు జరగాల్సిన బీసీ రిజర్వేషన్లు చట్ట సభల్లో రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటికీ కల్పించక పోవడం విచారకరం.

రాజ్యాంగం నీడలో..

చారిత్రక  దేశంగా మారిన ఇండియా మౌలికం గా ఫెడరల్ నిర్మాణం కలిగినది.      పేదరికం లేని, నిరుద్యోగం లేని ప్రణాళిక కోసం ఈ దేశం ఇంకా ఎదురుచూడటం పట్ల మన రాజకీయ వ్యవస్థ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనాభా పెరుగుదల, సామాజిక అంశాలను దృష్టి లో ఉంచుకొని దేశ ప్రణళికలు రచించబడాలి. రా జ్యాంగ సవరణలు అవసరమైనపుడు ప్రజల కోసం జరుపుకోవాలి.  అలాంటి సవరణలు రాజ్యాంగ స్ఫూర్తిని మరింత విస్తరించాలి. రాజ్యాంగం నీడలో  సమానత్వం సురక్షితం కావాలంటే.. ప్రతి కుటుంబానికి కనీసం వెయ్యి చదరపు అడుగుల ఇల్లు, 
కరెంటు, మంచినీరు, ఉచిత ఉన్నత విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు మెరుగుదల ..అన్ని రంగాల్లో ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా, జనాభా ప్రాతిపదికన, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం సాధించినపుడే..నిజమైన పూర్తి స్థాయి గణతంత్ర దేశంగా భారతదేశం వికాసం చెందుతుంది. అందుకు ప్రజల సంకల్ప సిద్దికై కృషి చేయాలి. 

 జనవరి26 కి అనేక ప్రత్యేకతలున్నాయి. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, భాష ,ప్రాంత వివక్షలను నిరాకరిస్తూమనుషులందరు సమానమేనని గుర్తించిన రోజు 26  జనవరి 1950. భారత రాజ్యాంగం రాసుకొని స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మ గౌరవానికి హామీ ఇచ్చుకుని అంకితమైన రోజు ఇది. ప్రపంచ రాజ్యాంగాలలో ఉత్తమమైనదని ప్రశంలందుకున్నది మన రాజ్యాంగం. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టు కమిటీ, బాబూ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షులుగా తుది రూపం తీసుకున్నది.

మన దేశంలో మూడింట ఒక వంతు మాత్రమే ప్రజాస్వామ్యం కొనసాగు తున్నది. అభివృద్ది నిరంతరంగా సాగుతుండాలి. ఆధునిక సైన్సు టెక్నాలజీ వేగంగా ముందుకు దూసుకుపోతున్నది. ఇప్పటి అభివృద్ధి మాకు రేపటి అభివృద్ధి మీకు అని ఉద్యమించండని చెప్పడం సరైనది కాదు. వర్తమాన అభివృద్ధి నిరంతరం అట్టడుగు ప్రజలకు అందించడం ద్వారానే సామాజిక న్యాయం , సామాజిక మార్పు జరుగుతుంది. 

రాజ్యాంగ పరిషత్​ ఆమోదం

అలా స్వాతంత్ర్యం పొందిన భారత ప్రజల కోసం అంతదాకా అమలులో ఉన్న 1935 రాజ్యాంగాన్ని స్వతంత్ర దేశానికి అనువుగా1946లో ఎన్నికల ద్వారా ఎన్నికైన 298 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యుల చర్చల ద్వారా తుది రూపు ఇచ్చి 26 నవంబర్ 1949 న ఆమోదించుకుని 26 జనవరి నుంచి అమలులోకి తెచ్చుకున్నాం. రాజ్యాంగ డ్రాఫ్టు కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కీలక పాత్ర నిర్వహించారు. 1950 జనవరి 26 రాజ్యాంగం ద్వారా సార్వత్రిక ఓటు హక్కు ఏర్పడింది. ఈ రాజ్యాంగం ద్వారా మనుషులందరు సమానమని గుర్తించబడ్డారు. అంతకు ముందు మనుషులు అందరు సమానంగా గుర్తించబడలేదు. ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నో సంస్థానాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, అతి పెద్దదైన నైజాం రాజ్య ప్రజల ప్రాతినిధ్యం లేదు. ఆ లోపం తెలంగాణకు శాపమైంది.

- బి ఎస్ రాములు​, 
మాజీ చైర్మన్​,
టీఎస్​ బీసీ కమిషన్