హిజాబ్పై భిన్న తీర్పులు.. సీజేఐకు రిఫర్ చేసిన ధర్మాసనం..

 హిజాబ్పై భిన్న తీర్పులు.. సీజేఐకు రిఫర్ చేసిన ధర్మాసనం..

హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు భిన్న తీర్పులు వెలువరించారు. జడ్జిల్లో ఒకరైన జస్టిస్ హేమంత్ గుప్తా కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా.. మరో జడ్జి జస్టిస్ సుధాన్షు ధులియా హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించారు. కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న  జస్టిస్ హేమంత్ గుప్తా హిజాబ్ను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. కర్నాటక హైకోర్టు తీర్పుపై దాదాపు 10 రోజుల పాటు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరగగా సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ లో ఉంచింది.  తాజాగా తీర్పు వెలువరించింది.

హిజాబ్ ధరించే అంశం కేవలం వ్యక్తుల ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశమే తప్ప ఇంకేం కాదని జస్టిస్ హేమంత్ గుప్తా అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో అమ్మాయిల చదువే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు. పిటిషనర్లను 11 ప్రశ్నలు అడిగిన జస్టిస్ హేమంత్ గుప్తా.. చివరకు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తన సహచర జడ్జి జస్టిస్ సుధాన్షు ధులియా తన తీర్పుతో ఏకీభవించనందున ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేశారు. భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువడిన నేపథ్యంలో సీజేఐ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ అంశం వివాదాస్పదంగా మారింది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఓ కాలేజీ యాజమాన్యం నిషేధం విధించింది. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2022న కర్నాటక ప్రభుత్వం కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. హిజాబ్ ధరించడం తమ రాజ్యాంగ హక్కు అని ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కాలేజ్ విద్యార్థినులు ఈ పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన కర్నాటక హైకోర్టు  మార్చి 15న సంచలన తీర్పు వెలువరించింది. పిటిషన్లను కొట్టి వేసిన ధర్మాసనం.. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని, విద్యార్థులు ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే కర్నాటక హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున, ఆ కోర్టు తీర్పు అనంతరం పిటిషన్ పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది.