
- స్పోర్ట్స్ అథారిటీ కాంట్రాక్టు కోచ్‌లను
- రెగ్యులరైజ్ చేసే విషయంలో నిర్లక్ష్యం!
- క్రీడాశాఖ మంత్రి పట్టించుకోవడం లేదని కోచ్‌ల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: క్రీడల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేస్తామంటున్న ప్రభుత్వం ఈ రంగంలో ఎంతో కీలకమైన కోచ్‌లను పట్టించుకోవడం లేదు. క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి వారిని చాంపియన్లుగా తీర్చిదిద్దే గురువులు గుర్తింపునకు నోచు కోవడం లేదు. వారి శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్)లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు కోచ్‌లు తమ ఉద్యోగాల రెగ్యులరైజ్ కోసం ఎంత మొరపెట్టుకున్నా క్రీడాశాఖ, ప్రభుత్వ పెద్దలు కనికరించడం లేదు. 1993, 1999, 2009లో వేర్వేరుగా వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా అన్ని అర్హతలతో కోచ్‌లుగా నియమితులైన వారిలో కొందరు రెగ్యులరైజ్ కోసం కొట్లాడి చివరకు కాంట్రాక్టు కోచ్‌లుగానే రిటైర్ అయ్యారు.
మిగిలిన కోచ్‌లు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వీరిలో 1993, 1999లో జాబ్‌లో చేరిన వారికి టైమ్ స్కేల్, ఇతర బెనిఫిట్స్ వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. 2009లో ఎంపికైన వారికి కేవలం బేసిక్ పే మాత్రం అందిస్తున్నారు. కనీసం పీఎఫ్ కూడా లేకపోవడంతో తమ శ్రమ దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్న తమ రెగ్యులరైజ్ కోసం క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు. తమ విషయంలో శాట్స్ ఉన్నతాధికారులే అడ్డుపడుతున్నారని వాపోతున్నారు. యాక్ట్2 (1994)ని అడ్డుగా చూపెట్టి తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ కాకుండా కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్ట్2 తమకు వర్తించదని చెబుతున్నా ఆర్థిక శాఖకు ఫైల్ పంపేప్పుడు కావాలనే దాన్ని ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. ‘అన్ని అర్హతలతో పేపర్ నోటిఫికేషన్ ద్వారా మేం శాట్స్‌లో కోచ్‌లుగా ఎంపికయ్యాం. ప్రభుత్వం ఇతర శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసింది. వారికి అడ్డురాని యాక్ట్2 మాకెందుకు వస్తుంది?. ఇతర శాఖలకు చెందిన కొందరికి అర్హతలు లేకపోయినా శాట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పదవులు అప్పగించారు. జిల్లా క్రీడా అధికారులుగా స్పోర్ట్స్‌కు సంబంధం లేని వాళ్లను నియమిస్తున్నారు.
మరి, మాకు అడ్డొచ్చే నిబంధనలు వారికి ఎందుకు వర్తించవు?. దీన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇతర శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేసేందుకు ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు చొరవ తీసుకుంటున్నారు. మా విషయంలో క్రీడా శాఖ మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఉద్యోగిగా, ఉద్యోగ సంఘాల నాయకుడిగా పని చేసిన క్రీడా శాఖ మంత్రే పట్టించుకోకపోతే మాకు దిక్కెవరు ?. మా విషయంలో సీఎం కేసీఆర్ అయినా స్పందించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ’ అని కాంట్రాక్ట్ కోచ్‌లు గోడు వెళ్లబోసుకున్నారు.