స్పోర్ట్స్‌‌ కోటా అమలు చేయాల్సిందే: హైకోర్టు

స్పోర్ట్స్‌‌ కోటా అమలు చేయాల్సిందే: హైకోర్టు
  • గుర్తించిన క్రీడలన్నింటికీ రిజర్వేషన్ కల్పించాలి 
  • స్పోర్ట్స్‌‌ కోటాలో 2 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌-1తో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 2 శాతం స్పోర్ట్స్‌‌ కోటా అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న విధంగా క్రీడాకారులందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. గ్రూప్‌‌-1తో పాటు జూనియర్‌‌ లెక్చరర్‌‌ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో 2012నాటి 74 జీవో, 2018న సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో 107, క్రీడా శాఖ జారీ చేసిన జీవో 5ను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 25 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టి, తీర్పు వెలువరించారు.

అన్ని నియామకాల్లో క్రీడాకారులను సమానంగా గుర్తించాలన్నారు. స్పోర్ట్స్‌‌ కోటాకు సంబంధించి అనుబంధం- 1, 2లో పేర్కొన్న క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రతిభ ఆధారంగా అవకాశం కల్పించాలని ఆదేశించారు. అలాకాకుండా, గ్రూప్‌‌-1 నియామకాలకు కేవలం అనుబంధం-1లో ఉన్న 29 విభాగాల క్రీడాకారులే అర్హులని పేర్కొనడం సరికాదని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. రెండు అనుబంధాల్లో పేర్కొన్న క్రీడాకారులను మెరిట్‌‌ ఆధారంగా అవకాశం కల్పించాలని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించారు.