బీహార్లో ప్రాణాలు తీసిన కల్తీ మద్యం

బీహార్లో  ప్రాణాలు తీసిన కల్తీ మద్యం

నలంద: బీహార్లో విషాదం చోటు చేసుకుంది. సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. సంపూర్ణ మద్యపానం అమలుచేస్తున్న రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి నలంద పట్టణంలోని చోటీ పహాడీ, ప్రభు బీగా ప్రాంతాలకు చెందిన పలువురు మద్యం సేవించారు. వారిలో నలుగురు శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోగా.. సాయంత్రం మరో నలుగురు మృతి చెందారు. ఆదివారం ఉదయం మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో విఫలమైన స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యంతో సంబంధం ఉన్న 34 మందిని అరెస్ట్ చేసినట్లు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శశాంక్ శుభంకర్ చెప్పారు.