‘రాజ రాజ చోర’ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రం ‘శ్వాగ్’. రీతూ వర్మ హీరోయిన్. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీవిష్ణు ఇలా ముచ్చటించాడు.
‘‘ఇది ఒక వంశానికి సంబంధించిన కథ.1500వ సంవత్సరంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం మధ్య క్లాష్‌తో ఈ కథ మొదలవుతుంది. ఆడ, మగలో ఎవరు గొప్ప అనే అంశంపై టిట్ ఫర్ టాట్ లాంటి స్టోరీ. డ్యూయల్ రోల్స్ కూడా చేయని నేను ఇందులో ఏకంగా నాలుగు పాత్రలు పోషించా. నేను కాకుండా, నేను పోషించిన పాత్రలే కనిపిస్తాయి. ముఖ్యంగా క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ పాత్రలో చాలా మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. సినిమా చూశాక ఆడవాళ్లపై అభిమానం, గౌరవం పెరుగుతుంది.
భవభూతి పాత్రను ఆడవాళ్లు చాలా ఇష్టపడతారు. నాలుగు పాత్రల్లో ‘సింగ’ పాత్ర సులభం అనిపించింది. మిగతా మూడు గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం. రోజుకి నాలుగున్నర గంటల సేపు మేకప్ వేసుకోవడం, తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడంతో చాలా కష్టంగా అనిపించేది. కానీ టీజర్ రెస్పాన్స్‌తో మా కష్టానికి తగిన ఫలితం లభించింది. కథలో భాగంగానే ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. అందరికీ అర్ధమయ్యే స్క్రీన్ ప్లే ఉంటూనే ఎంగేజింగ్‌గా ఉంటుంది.
కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు ఓ ట్విస్ట్, మరికొన్ని సర్‌ప్రైజ్‌లతో నాలుగు తరాల పెద్ద కథను రెండున్నర గంటల్లో భలే చెప్పారే అనిపిస్తుంది. .పెద్ద వాళ్లకి నచ్చడంతో పాటు ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది టాప్ ఫిల్మ్‌గా నిలుస్తుందనే నమ్మకముంది. అలాగే మమ్మల్ని నమ్మి నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మంచి సక్సెస్‌ను ఇస్తుంది. ఇక ఓ థ్రిల్లర్‌తో పాటు గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఓ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నా’’.