హైదరాబాద్‌‌పై ధోనీసేన గెలుపు

హైదరాబాద్‌‌పై ధోనీసేన గెలుపు

పుణె: మహేంద్ర సింగ్‌‌ ధోనీ మళ్లీ కెప్టెన్సీ అందుకోగానే చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ ఆట పూర్తిగా మారింది.  బ్యాటింగ్‌‌లో  రుతురాజ్ గైక్వాడ్ (57 బాల్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 99), డెవోన్ కాన్వే (55 బాల్స్ లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 85 నాటౌట్), బౌలింగ్‌‌లో ముకేశ్‌‌ చౌదరి (4/46) కేక పుట్టించడంతో ఆదివారం రాత్రి జరిగిన  మ్యాచ్‌‌లో 13 రన్స్‌‌ తేడాతో సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ను ఓడించిన ధోనీసేన లీగ్‌‌లో ముచ్చటగా మూడో విక్టరీతో మురిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 202/2 భారీ స్కోర్ చేసింది. రైజర్స్ బౌలర్లలో నటరాజన్ (2/42) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడి 189/6 స్కోరేచేసిన హైదరాబాద్ లీగ్‌‌లో నాలుగో ఓటమి చవిచూసింది. కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్ (37 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), నికోలస్ పూరన్ (33 బాల్స్ లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 

ఓపెనర్లే దంచారు

బ్యాటింగ్ పిచ్ పై చెన్నై ఓపెనర్లు రుతురాజ్, కాన్వే.. రైజర్స్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం సాధించారు. రెండో ఓవర్లోనే సిక్స్ తో గైక్వాడ్ మంచి టచ్ లో కనిపించగా కాన్వే అతడికి సపోర్ట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఉమ్రాన్ వేసిన 10వ ఓవర్లో రెండు ఫోర్లతో గైక్వాడ్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మార్ క్రమ్ బౌలింగ్​లో రెండు సిక్స్ లతో పాటు ఉమ్రాన్ ఓవర్లో 4,4,6తో రెచ్చిపోయాడు. అప్పటివరకు సపోర్ట్ ఇస్తూ ఆడిన కాన్వే.. జాన్సెన్ వేసిన 15వ ఓవర్లో 6,4,6తో గేర్ మార్చాడు. వీరిద్దరూ ఇదే జోరు చూపించడంతో 17 ఓవర్లలోనే స్కోర్ 172 దాటింది. తర్వాతి ఓవర్లో 99 రన్స్ వద్ద నటరాజన్ బౌలింగ్‌‌లో ఔటైన గైక్వాడ్ సెంచరీ మిస్‌‌ చేసుకోగా.. తొలి వికెట్‌‌కు 182 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. ధోనీ (8) విఫలమైనా.. చివరి ఓవర్లో కాన్వే 4,4తో స్కోరు 200 దాటించాడు.  

ముకేశ్‌‌ తడాఖా

భారీ ఛేజింగ్ లో హైదరాబాద్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), విలియమ్సన్ శుభారంభం ఇచ్చినా.. సీఎస్‌‌కే పేసర్‌‌ ముకేశ్‌‌ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి దెబ్బకొట్టాడు.  మొదటి ఓవర్లోనే రెండు ఫోర్లతో అభిషేక్ బౌండ్రీల ఖాతా తెరవగా.. రెండో ఓవర్లో 6,4 బాదిన విలియమ్సన్ కూడా జోరు మీద కనిపించాడు. కానీ, ఆరో ఓవర్లో వరుస బాల్స్​లో అభిషేక్, రాహుల్ త్రిపాఠి (0)ని పెవిలియన్ చేర్చిన ముకేశ్.. సీఎస్ కేకు బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో కేన్​కు తోడైన  మార్ క్రమ్ (17).. 10వ ఓవర్లో రెండు సిక్స్ లతో దూకుడు చూపించినా తర్వాతి బంతికే శాంట్నర్ తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఆపై విలియమ్సన్, నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. వీరిద్దరూ కుదురుకుంటున్న దశలో  కేన్  ఎల్బీగా వెనుదిరిగాడు. 30 బాల్స్ లో 72 రన్స్ అవసరమైన దశలో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో పూరన్, శశాంక్ (15) బౌండ్రీలు రాబట్టడంలో విఫలమయ్యారు. 18వ ఓవర్లో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన ముకేశ్.. శశాంక్, సుందర్ (2)లను ఔట్ చేసి చెన్నై విజయం ఖాయం చేశాడు. ఆఖరి ఓవర్లో పూరన్ 6,4,6,6 బాది ఫిఫ్టీ పూర్తి  చేసుకోవడంతో పాటు ఓటమి అంతరాన్ని తగ్గించాడు.