SRHకు దెబ్బ మీద దెబ్బ.. అసలే ఘోరంగా ఓడిపోయిన బాధలో ఉంటే..

SRHకు దెబ్బ మీద దెబ్బ.. అసలే ఘోరంగా ఓడిపోయిన బాధలో ఉంటే..

గుజరాత్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా SRH జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్కు భారీగా జరిమానా పడింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్కు బీసీసీఐ 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ 2026 సీజన్లో ఒక మ్యాచ్‌లో SRH స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏమైందంటే.. పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, స్మరణ్ రవిచంద్రన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. తొలి ఆరు ఓవర్లలో కగిసో రబడ 3 వికెట్లు తీయగా, సిరాజ్ కూడా ఒక వికెట్ తీశాడు. 10వ ఓవర్ ముగిసేసరికి 60/7 స్కోరుతో నిలిచారు. చివరికి.. 14.5 ఓవర్లలో 86 పరుగులకే SRH ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో.. జాసన్ హోల్డర్ 3 వికెట్లు పడగొట్టగా, ప్రసీద్ కృష్ణ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ చివరి వికెట్ తీశారు.

ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం, ఇరు జట్లు తమ నిర్ణీత 20 ఓవర్లను 90 నిమిషాలలోపు రెండు స్ట్రాటజిక్ టైమ్‌అవుట్లతో ఫినిష్ చేయాలి. అయితే, DRS తీసుకున్న సమయం, గాయం, సడన్ డ్రింక్స్ బ్రేక్ సమయాన్ని ఈ గంటన్నర నుంచి మినహాయిస్తారు. అయినప్పటికీ, ఒక జట్టు తమ 20 ఓవర్లను నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేయకపోతే, అప్పుడు జరిమానా విధిస్తారు. జట్టు మొదటిసారి స్లో ఓవర్ రేట్ సమస్యను ఎదుర్కొంటే, బౌలింగ్ జట్టు కెప్టెన్ మాత్రమే రూ.12 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఆటగాళ్ళకు జరిమానా విధించరు.

SRH vs GT మ్యాచ్ ఇలా సాగింది:
మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ 82 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ చేతిలో ఓడింది. టాస్‌‌ ఓడిన గుజరాత్‌‌ 20 ఓవర్లలో 168/5 స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌‌ (44 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 61), వాషింగ్టన్‌‌ సుందర్‌‌ (33 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 50) రాణించారు. తర్వాత హైదరాబాద్‌‌ 14.5 ఓవర్లలో 86 రన్స్‌‌కే ఆలౌటైంది. SRH​ చరిత్రలోనే ఇదే అత్యల్ప స్కోరు. కమిన్స్‌‌ (19) టాప్‌‌ స్కోరర్‌‌. ఇక మెగా లీగ్లో వరుసగా ఐదు విజయాలు నమోదు చేయడం జీటీకి ఇది రెండోసారి. రబాడాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.