SRH vs RR: రాజస్థాన్ ఎదుట ధీటైన టార్గెట్.. బౌలర్లపైనే హైద‌రాబాద్‌ ఆశలు

SRH vs RR: రాజస్థాన్ ఎదుట ధీటైన టార్గెట్.. బౌలర్లపైనే హైద‌రాబాద్‌ ఆశలు

కీలక మ్యాచ్‌లో హైద‌రాబాద్‌ బ్యాటర్లుపర్వాలేదనిపించారు. తలా ఓ చేయి వేసి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు. చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌ -2లో స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. క్లాసెన్(50)  హాఫ్ సెంచరీ చేయగా.. రాహుల్ త్రిపాఠి(37), ట్రావిస్ హెడ్ (34) పరుగులతో రాణించారు.  

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్‌ తొలి ఓవర్‌ లోనే వికెట్ కోల్పోయింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌(12)ను ట్రెంట్ బౌల్ట్ వెన‌క్కి పంపాడు. అనంతరం క్రీజులోకి రాహుల్ త్రిపాఠి(37; 1 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. అశ్విన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో తొలి బంతికి హెడ్ సింగిల్ తీయగా.. స్ట్రైక్ లోకి వచ్చిన త్రిపాటి వరుసగా 4, 4, 6 బాదాడు. దీంతో 4 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోరు 45 పరుగులు చేసింది. 

తొలి మూడు వికెట్లు.. బౌల్ట్‌కే 

బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదిన త్రిపాఠి మూడో బంతికి చాహల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి మర్‌క్రమ్(1) కూడా ఔట్ అవ్వడంతో స‌న్‌రైజ‌ర్స్ 57కే 3 వికెట్లు కోల్పోయింది. ఆ మూడు బౌల్ట్ పడగొట్టినవే. ఆ సమయంలో హెడ్ (34),  క్లాసెన్ (50; 34 బంతుల్లో 4 సిక్స్‌లు) జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని సందీప్‌ శర్మ విడదీశాడు. దూకుడు మీదున్న హెడ్‌ను ఔట్ చేశాడు. అనంతరం ఎస్‌ఆర్ హెచ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. తడబడుతూ వచ్చిన నితీశ్‌ రెడ్డి(5) అవేశ్‌ ఖాన్‌ చేతికి చిక్కగా.. ఆ మరుసటి బంతికే అబ్దుల్ సమద్(0) డకౌటయ్యాడు. చివరలో క్లాసెన్- షాబాజ్ అహ్మద్(18) విలువైన పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. 

రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.