ఎమర్జెన్సీ ఎత్తేసిన లంకాధ్యక్షుడు

ఎమర్జెన్సీ ఎత్తేసిన లంకాధ్యక్షుడు

శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తేస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మంగళవారం రాత్రి ప్రకటించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో.. ఏప్రిల్  1 నుంచి శ్రీలంకలో అత్యసవర పరిస్థితి విధించారు. 

మంగళవారం సైన్యం, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. పిల్లలు, మహిళలు సహా భారీ సంఖ్యలో ప్రజలు పార్లమెంట్ ఎదుట నిరసనగా దిగారు. కర్ఫ్యూ  అమల్లో ఉన్నప్పటికీ.. ప్రజలు తమ ఆందోళనలను కంటిన్యూ చేశారు. నిరసనకారులను అదుపుచేసేందుకు సైనిక బృందం రావడంతో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితి దిగజారడంతో.. సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని వెంబడించి ఆపేందుకు ప్రయత్నించారు. సైనికులు తుపాకులతో అక్కడికి రావడం వల్లే పోలీసులు వారిని అడ్డుకున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆందోళనకారులపై సైన్యం దాడికి దిగితే పరిస్థితి మరింత విషమిస్తుందని భావించే పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మీడియా పోస్టులపై అలెర్ట్ అయిన ఆర్మీ ఛీఫ్ శవేంద్ర సిల్వ ఘర్షణపై విచారణకు ఆదేశించారు. 

కాగా.. శ్రీలంకలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో శ్రీలంక... ఐక్యరాజ్యసమితి నుంచి ఆంక్షలు ఎదుర్కొంటోంది. శ్రీలంక విదేశాల్లో దౌత్యకార్యాయాల నిర్వహణను కూడా చేపట్టలేకపోతోంది. దీంతో నార్వే, ఇరాక్ , సిడ్నీలోని శ్రీలంక రాయబార కార్యాలయాలను మూసివేసింది. శ్రీలంకలోని ఆర్థిక, రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్నామని ఐఎంఎఫ్ ప్రకటించింది. ప్రజల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామంది. 

అయితే తన ప్రభుత్వ చర్యలను అధ్యక్షుడు గొటబాయి సమర్థించుకున్నారు. కొవిడ్  వల్ల టూరిజం ఆగిపోయిందని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడం వల్లే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అధ్యక్షుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ చీఫ్ విప్ మరియు రహదారుల శాఖ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో తెలిపారు.

ఫుడ్ షార్టేజ్‎తో ఇబ్బందిపడుతున్న శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. శ్రీలంక అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్ .. తక్షణం బియ్యం పంపాలని నిర్ణయించింది. దీనిపై రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం వెళ్తున్నాయి.  కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్  తదితర పోర్టుల నుంచి శ్రీలంకకు బియ్యం ఎగుమతి చేయనున్నారు. మొదటగా కాకినాడ పోర్టు నుంచి ఇవాళ రెండు వేల మెట్రిక్  టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు.

ఇకపోతే పలువురు చట్టసభ్యులు అధికార కూటమిని వీడారు. దీంతో రాజపక్స సర్కారు మైనార్టీలోకి వెళ్లింది. ప్రభుత్వం మాత్రం తమకు పూర్తి మెజార్టీ ఉన్నట్టు చెబుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సూచనలేమీ కనిపించట్లేదు. ఇప్పటికే ప్రభుత్వంలో మంత్రులుగా చేరాలన్న అధ్యక్షుడు గొటబాయ పిలుపును ప్రతిపక్షాలు తిరస్కరించాయి.

For More News..

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

వీడియో: సాయం కోసం మెట్రో మాల్ ముందు క్యూలైన్లు

హైదరాబాద్ లో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్