టీమిండియా మరో ధనాధన్ పోరాటానికి రెడీ

టీమిండియా మరో ధనాధన్ పోరాటానికి రెడీ

పుణె :   టీమిండియా మరో ధనాధన్‌‌ పోరాటానికి రెడీ అయ్యింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం జరిగే ఫైనల్‌‌ టీ20లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్‌‌లో ఫస్ట్‌‌ మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దు కాగా సెకండ్‌‌ టీ20లో గెలిచిన ఇండియా ప్రస్తుతం 1–0తో లీడ్‌‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా సిరీస్‌‌ విజయంపై కన్నేయగా.. ఎలాగైనా మ్యాచ్‌‌ గెలిచి పరువు కాపాడుకోవాలని లంక భావిస్తోంది. ఇండోర్‌‌ వేదికగా జరిగిన టీ20లో లంక నుంచి కనీస పోరాటం లేకపోవడంతో ఈ మ్యాచ్‌‌లోనూ టీమిండియా ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. 2016లో ఈ వేదికపై ఆడిన లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో తమను ఓడించిన లంకపై ప్రతీకారం తీర్చుకోవాలని కూడా కోహ్లీసేన కోరుకుంటోంది.

శిఖర్‌‌ వర్సెస్‌‌ రాహుల్‌‌

లంకతో పోలిస్తే టీమిండియా బ్యాటింగ్‌‌ లైనప్‌‌ చాలా బలంగా ఉంది. పెద్దగా సమస్యలు కూడా లేవు. అయితే ఈ మ్యాచ్‌‌లో శిఖర్‌‌ ధవన్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ మధ్య ఓపెనింగ్‌‌ స్లాట్‌‌ రేస్‌‌ మరింత రసవత్తరంగా  ఉండనుంది. ఇండోర్‌‌లో రాహుల్ మరోసారి ఫామ్‌‌ చూపెట్టగా ధవన్‌‌ ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రేస్‌‌లో రాహుల్‌‌ ముందుండగా.. ఆసీస్‌‌లో రోహిత్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ మొదలుపెట్టాలనుకుంటే భారీ స్కోరు చేయడం ధవన్‌‌కు తప్పనిసరి. ఇక, గత మ్యాచ్‌‌లో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ను వన్‌‌డౌన్‌‌లో పంపి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌కు వచ్చిన కోహ్లీ మరోసారి అదే పని చేయొచ్చు. ఎప్పటిలాగే రిషబ్‌‌ పంత్‌‌పై ఆసక్తి ఉండగా.. వరల్డ్‌‌కప్‌‌ నేపథ్యంలో శాంసన్‌‌, మనీశ్‌‌ పాండేను పరీక్షించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత సిరీస్‌‌తో కలిపి గత మూడు సిరీస్‌‌ల్లో పాండేకు ఒకే ఒక్క చాన్స్‌‌ ఇవ్వగా, నవంబర్‌‌లో జరిగిన బంగ్లాదేశ్‌‌ సిరీస్‌‌ నుంచి జట్టుతో ఉంటున్న శాంసన్‌‌కు అది కూడా దక్కలేదు. అయితే వీరిలో ఎవరికైనా చాన్స్‌‌ ఇస్తే ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తి రేపుతోంది. మనీశ్‌‌ను ఆడిస్తే దూబే బెంచ్‌‌కు పరిమితం కావొచ్చు. అయితే శాంసన్‌‌  కోసం పంత్‌‌ను పక్కనపెడతారా అంటే మాత్రం చెప్పలేం.

లంకేయుల ఆట మారేనా?

టీ20 వరల్డ్‌‌కప్‌‌కు నేరుగా అర్హత సాధించలేక  క్వాలిఫయర్స్‌‌ బరిలో నిలిచిన లంకేయులు మ్యాచ్‌‌లో గెలవాలన్నా, కనీస పోటీ ఇవ్వాలన్నా చాలా మారాలి. పైగా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌‌లో రాణించడం ఆ  టీమ్‌‌కు చాలా అవసరం. బ్యాట్స్‌‌మెన్‌‌ బాధ్యతారాహిత్యం జట్టుకు శాపంగా మారింది.  హోల్కర్‌‌ స్టేడియంలో బ్యాటింగ్‌‌ వికెట్‌‌పై కూడా బ్యాట్స్‌‌మెన్‌‌ పరుగుల కోసం నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ధనంజయ డిసిల్వ ఔటైన విధానం చూశాక బ్యాట్స్‌‌మెన్‌‌ నిర్లక్ష్యంపై కెప్టెన్‌‌ మలింగ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. దీంతో ఫామ్‌‌లో ఉన్న  కుశాల్‌‌ పెరీరాపైనే  మరోసారి భారం ఉండనుంది. మరోపక్క ఆల్‌‌రౌండర్‌‌ ఇసురు ఉడాన గాయంతో మ్యాచ్‌‌కు దూరమవడం లంకకు ఎదురు దెబ్బే. అతని ప్లేస్‌‌లో  సీనియర్‌‌ క్రికెటర్‌‌ ఏంజెలో మాథ్యూస్‌‌ షార్ట్‌‌ ఫార్మాట్‌‌ రీఎంట్రీకి లైన్‌‌క్లియర్‌‌ అయ్యింది. మాథ్యూస్‌‌ అనుభవం జట్టుకు కలిసొచ్చే అవకాశముంది.  మాథ్యూస్‌‌ ఈ ఫార్మాట్‌‌లో ఆడి 16 నెలలు అవుతోంది. కానీ,  తన చివరి నాలుగు వన్డేల్లో అతను 113, 48, 52*, 87 స్కోర్లు చేయడం గమనార్హం. ఇక మలింగ సహా బౌలర్లంతా గాడిలో పడితేనే  ఇండియాకు లంక పోటీ ఇవ్వగలదు.

బుమ్రా టచ్‌‌లోకి రావాలి..

గత మ్యాచ్‌‌తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా స్థాయికి తగ్గ బౌలింగ్‌‌ చేయలేదు. కుర్రాళ్లు సైనీ, ఠాకూర్‌‌ కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో ఇండియా మ్యాచ్‌‌లో పైచేయి సాధించగలిగింది. ఓవరాల్‌‌గా పేస్‌‌ అటాక్‌‌ బలంగానే ఉన్నప్పటికీ ప్రధాన పేసర్​ బుమ్రా మునుపటి టచ్‌‌ను అందుకోవాలని జట్టు కోరుకుంటుంది. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌.. ఆపై కీలకమైన న్యూజిలాండ్‌‌ టూర్‌‌ నేపథ్యంలో బుమ్రా ఫామ్‌‌లోకి రావడం జట్టుకు అవసరం.  స్పిన్‌‌ కోటాలో సుందర్‌‌ ఆడడం ఖాయం కాగా కుల్దీప్‌‌, చహల్‌‌లో విరాట్‌‌ ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి. జడేజా మరోసారి బెంచ్‌‌కు పరిమితం కావొచ్చు.