నెహ్రూ స్టాంపును రిలీజ్ చేయనున్న శ్రీలంక

నెహ్రూ స్టాంపును రిలీజ్ చేయనున్న శ్రీలంక

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీలంక... భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రం ఉన్న స్టాంపును విడుదల చేయనుంది. ఫిబ్రవరి 4 ఉదయం 8.30గంటలకు గాల్ గేస్ గ్రీన్ లో రాష్ట్రపతి రణిల్ విక్రమ సింఘే, ప్రధాని దినేష్ గువర్థన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. 75 ఏళ్ల వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని భావిస్తున్న ఆ దేశం.. ఇందుకోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నమో నమో మాత - శతాబ్దానికి ఒక అడుగు అనే థీమ్ తో ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేనాటికి స్థిరమైన ప్రభుత్వ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన కొత్త సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించనుంది. 

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 2 సాయంత్రం శ్రీ దళాద మాలిగవాలో బౌద్ధ మతపరమైన ఆచారాలు నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు విక్టోరియా డ్యామ్ వద్ద అధికారులు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 3న అన్నదాన కార్యక్రమంతో పాటు మతపరమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని పబ్లిక్ పార్కులు, నేషనల్ జువాలజీ డిపార్ట్ మెంట్ ఆధీనంలో ఉన్న పార్కులు, బొటానికల్ గార్డెన్స్ ను ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పించారు.