గోటబయ రాజీనామాతో లంక ప్రజల సంబరాలు

 గోటబయ రాజీనామాతో లంక ప్రజల సంబరాలు
  • కొలంబో వీధుల్లో యుద్ధ ట్యాంకులు
  • శ్రీలంకలో రంగంలోకి దిగిన ఆర్మీ
  • హింసకు దూరంగా ఉండాలని నిరసనకారులకు సూచన
  • లేదంటే పరిణామాలుతప్పవని హెచ్చరిక
  • సింగపూర్​ నుంచి రాజీనామా ప్రకటన చేసిన గోటబయ

కొలంబో/సింగపూర్: శ్రీలంక నుంచి పారిపోయిన ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. గోటబయ రాజీనామా లెటర్​ అందిందని పార్లమెంట్​ స్పీకర్​ గురువారం వెల్లడించారు. దీంతో శ్రీలంక ప్రజలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నరు. మరోవైపు, తాత్కాలిక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే ఆదేశాలతో ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధ ట్యాంకులతో కొలంబో వీధుల్లో మార్చ్ చేసింది. మరోసారి తీవ్ర నిరసనలు జరిగితే అడ్డుకునేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో గురువారం కొలంబో వీధులు ప్రశాంతంగా కనిపించాయి. ‘‘నిరసనకారులు హింసకు దూరంగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. బలవంతంగానైనా సరే నిరోధించే చట్టబద్ధమైన అధికారం భద్రతా దళాలకు ఉంది” అని ఆర్మీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. బుధవారం ఆందోళన సందర్భంగా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా వినలేదని, ఆందోళనకారులు సైనికులపై దాడి చేసి రెండు టీ56 తుపాకులను, 60 బుల్లెట్లను గుంజుకున్నారని చెప్పింది. మరోవైపు పశ్చిమ ప్రావిన్స్‌‌‌‌లో విధించిన కర్ఫ్యూను.. గురువారం ఎత్తివేసినట్లు అధికారులు చెప్పారు. అయితే రాజపక్స రాజీనామాపై గందరగోళం నెలకొనడంతో కర్ఫ్యూను మళ్లీ విధించారు. బుధవారం ప్రధాని కార్యాలయం, పార్లమెంట్ వద్ద జరిగిన ఆందోళనల్లో 84 మందికి పైగా గాయపడ్డారు. 

ఇయ్యాల ప్రధాని అభ్యర్థి ప్రకటన!
గోటబయ రాజీనామా లేఖ అందడంతో పార్లమెంట్​ సమావేశాలపై తొందర్లోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు స్పీకర్​ ఆఫీసు ప్రకటించింది. గురువారం సాయంత్రం వరకూ గోటబయ రాజీనామా ప్రకటనపై ఎటూ తేలకపోవడంతో స్పీకర్​ మహింద యప అభేయ వర్దెన స్పందించారు. గోటబయను తొలగించేందుకు ఇతర మార్గాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే, సింగపూర్​లో ల్యాండ్​ అయిన వెంటనే గోటబయ తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. కాగా, ప్రధాని పదవికి అభ్యర్థిని ప్రతిపక్షాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రకటించే అవకాశం ఉందని మీడియా తెలిపింది. 

దేశం విడిచి వెళ్లబోమన్న మహింద, బాసిల్
తమకు వ్యతిరేకంగా దాఖలైన ఫండమెంటల్ రైట్స్ పిటిషన్‌‌‌‌పై విచారణ జరిగేదాకా తాము దేశం విడిచి వెళ్లబోమని లంక సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బిసిల్ రాజపక్స తెలిపారు. ఈ మేరకు వారి లాయర్ల ద్వారా అండర్‌‌‌‌‌‌‌‌టేకింగ్ ఇచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. వీరిద్దరిపై దాఖలైన పిటిషన్లను సీజేఐతో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్ శుక్రవారం విచారించనుంది.