ప్రింటింగ్ పేపర్ లేకపోవడంతో బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

ప్రింటింగ్ పేపర్ లేకపోవడంతో బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. దేశంలో ప్రింటింగ్ పేపర్ లేకపోవడంతో విద్యార్థులకు నిర్వహించే అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేశారు. దీంతో 4.5 మిలియన్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.  నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్యాస్ ధర విపరీతంగా పెంచారు. దాదాపు 90 శాతం హోటళ్లు శ్రీలంకలో మూతపడ్డాయి. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 283 గా ఉంది. లీటర్ డీజిల్ రూ. 220 ఉంది. 1990 సంక్షోభం కంటే మరింత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. కిలో చికెన్ కొనాలంటే ఏకంగా రూ. 1000 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఒక్క కోడిగుడ్డు ధర రూ. 35  పలుకుతుంది. లీటర్ కొబ్బరి నూనె 900 రూపాయలు, కిలో పాలపొడి 2 వేలుగా ఉంది.. ఇక గ్లాసు పాలకు రూ. 100  ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం డాలర్ తో శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270 కి  చేరింది. ఫలితంగా నిత్యావసర వస్తువులతో పాటు.. ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. 

చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ధరలకు.. ప్రభుత్వానిదే బాధ్యతంటూ గత కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్  చేస్తూ.. నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న కొలంబొలోని అధ్యక్ష భవనాన్ని.. వందలాది మంది ప్రజలు ముట్టడించగా అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అటు విపక్షాలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి.