ఇయ్యాల్టీ నుంచి రాజన్న ఆలయంలో నవమి ఉత్సవాలు

ఇయ్యాల్టీ నుంచి రాజన్న ఆలయంలో నవమి ఉత్సవాలు

17న శ్రీ సీతారాముల కల్యాణం
లక్షమంది భక్తులు వస్తారని అంచనా 

వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో నేటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  17న సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి 17 వరకు తొమ్మిదిరోజుల పాటు నవమి ఉత్సవాలు కొనసాగనున్నాయి.  ప్రతిరోజు ఉదయం 6.30 గంటల నుంచి శ్రీ స్వామివార్లకు, శ్రీ సీతా రామచంద్రస్వామి వార్లకు, పరివార అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

9న ఉదయం 8గంటలకు స్వస్తి పుణ్యాహవాచనం, 10.40గంటలకు పంచాంగ పూజ, సాయంత్రం 4గంటలకు పంచాంగ శ్రవణం, పండిత సన్మానం నిర్వహించనున్నారు. రాత్రి సమయంలో ఉత్సవమూర్తులను పెద్దదేవపై ఊరేగించనున్నారు. అలాగే 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు భక్తోత్సవం నిర్వహిస్తారు.  17న ఉదయం11.59 గంటలకు శ్రీ సీతరామచంద్రస్వామి  కల్యాణం  వైభవంగా నిర్వహిస్తారు.  

రాత్రి రథోత్సవం ముగిశాక  డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాజన్న ఆలయంలో జరిగే శ్రీ సీతరాముల కళ్యాణం తిలకించడానికి దాదాపు  లక్ష మంది వరకు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.   దేశవ్యాప్తంగా శివపార్వతులు, జోగినులు వేములవాడ రాజన్న సన్నిధికి తరలివస్తారు. ఒకవైపు సీతారాముల కల్యాణం జరుగుతుంటే ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ రాముడి కల్యాణంలో శివుడిని వివాహమాడినట్లు తన్మయం చెందుతారు.