శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌: శ్రీ రామనవమి సందర్భంలో హైదరాబాద్ సిటీలో శుక్రవారం రోజున శోభాయాత్ర జరగనున్న క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మార్చి 27న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు కీలక రహదారులపై ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సీతారాంబాగ్ టెంపుల్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు జరిగే ఈ శోభాయాత్ర మార్గంలో వాహనాలకు మళ్లింపులు అమలు చేస్తారు. ప్రత్యేకంగా బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

సిటీలో మార్చి 27న శ్రీరామనవమి శోభాయాత్రను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సర్వం సిద్ధమయ్యారు. 2010లో ప్రారంభమైన ఈ యాత్ర అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్త గుర్తింపు పొందిందని, సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ వేడుకను భక్తులు క్రమశిక్షణతో జరుపుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరారు. 

►ALSO READ | వారం ఆగండి.. వద్దన్నా గ్యాస్ సిలిండర్లు ఇస్తారు : రోజుకు 50 లక్షల బండలు సరఫరా

భద్రత కోసం 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ అరికట్టేందుకు క్రైమ్ టీమ్స్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.