
హైదరాబాద్, వెలుగు : ప్రజా ప్రభుత్వం ఎజెండాతో ముందుకు సాగుతున్న తమ పాలనలో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) , తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)లకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టీహబ్ లో శుక్రవారం జరిగిన అరైవల్ సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు. దేశంలో హైదరాబాద్ నంబర్ వన్ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
తన స్వగ్రామమైన ధన్వాడను టీటా 100 శాతం డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దిందని మంత్రి వెల్లడించారు. ఐటీ పరిశ్రమ వృద్ధి బాటలో నడిచేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో తమను భాగస్వామ్యం చేయడం సంతోషకరమని డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ మక్తాల అన్నారు.