- అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయం ప్రారంభం
- హాజరైన మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను కాకుండా అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో జరిగే అర్థవంతమైన చర్చను మీడియా జనంలోకి తీసుకెళ్లాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటీ ఆఫీసును మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు.
అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహిస్తామని, అయితే ప్రతిపక్షాలు కావాలని వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని.. వాటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. తాము రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలుచేసే పనిలో ఉంటే.. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకునే పనిలో ఉన్నారని విమర్శించారు.
సభలో ప్రతిపక్షాలకు తమ ప్రభుత్వం మాట్లాడే అవకాశం ఇచ్చినా, వారు తమ సమయాన్ని జనం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. సభలో ప్రతిపక్షం ప్రజా సమస్యలపై గళం విప్పాలి కానీ, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో, మండలిలో విలువైన సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు, అసెంబ్లీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కో చైర్మన్ చారి, సభ్యులు పాల్గొన్నారు.విప్ల ఆఫీసులను ప్రారంభించిన స్పీకర్, చైర్మన్అసెంబ్లీ, మండలి విప్లు వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కార్యాలయాలను కూడా స్పీకర్ ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
