కరోనాతో శ్రీకాకుళం వాసి మృతి!

కరోనాతో శ్రీకాకుళం వాసి మృతి!

ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లిన ఓ కార్మికుడు అక్కడ కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అర్జునపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బహ్రెయిన్‌లో పని చేస్తున్నాడు. అతడికి మూడ్రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడే ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని బహ్రెయిన్ అధికారులు స్వగ్రామంలో ఉన్న కుటుంబసభ్యులకు తెలియజేశారు. అతడి మృతదేహాన్ని తీసుకురావడం సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాలకు వ్యాపించింది. లక్షా 40 వేల మందికి పైగా వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు. దాదాపు 4500 మందికి పైగా మరణించారు. బహ్రెయిన్ దేశంలో 200 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇక భారత్‌లో 83 మందికి కరోనా సోకింది. మన దేశంలో కర్ణాటకలో ఒకరు, డిల్లీలో ఒకరు కరోనా బారినపడి మరణించారు.