శ్రీకాంతాచారి తల్లికి బీఆర్ఎస్​ పిలుపు.. గవర్నర్​కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం

శ్రీకాంతాచారి తల్లికి  బీఆర్ఎస్​ పిలుపు.. గవర్నర్​కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ హైకమాండ్​ నుంచి పిలుపు వచ్చింది. సీఎం కేసీఆర్​ఆదేశాలతో శంకరమ్మకు మంత్రి జగదీశ్ రెడ్డి ఫోన్​చేసి గురువారం హైదరాబాద్​లో తెలంగాణ అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వపరంగానూ ఆమెకు ఆహ్వానం పంపారు. నల్గొండ కలెక్టరేట్​తో పాటు సెక్రటేరియెట్ నుంచి ఆమెకు ఫోన్​చేసి ఈ కార్యక్రమానికి రావాలని కోరారు. ప్రభుత్వ పెద్దల ఆహ్వానంతో శంకరమ్మ బుధవారమే హైదరాబాద్​కు వచ్చారు. తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్​ను పోలీసులు అరెస్ట్​చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాంతాచారి ఎల్బీ నగర్​చౌరస్తాలో నిప్పంటించుకున్నారు. 

ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 2014లో శంకరమ్మకు హుజూర్​నగర్​ బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. కాంగ్రెస్​ అభ్యర్థి ఉత్తమ్​ కుమార్​రెడ్డి చేతిలో ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్న డిమాండ్​ఉంది. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్​ను ఆమె కలిసి తనకు ఎమ్మెల్సీగా చాన్స్​ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా సీఎంతో పాటు మంత్రి కేటీఆర్​ను ఆమె కలిశారు. ఈ సారి తప్పకుండా న్యాయం చేస్తామని ఆ సమయంలో కేటీఆర్ హామీ ఇచ్చారు. అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యుల నుంచి శంకరమ్మను ఎమ్మెల్సీ చేయబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును ఆమెకు ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది.