
బ్యాంకాక్: ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. థాయ్‌లాండ్ మాస్టర్స్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 22–20, 21–19తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. 45 నిమిషాల మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా కీలక సమయంలో శ్రీ ఎక్స్‌పీరియెన్స్‌ను ఉపయోగించి మ్యాచ్‌ను నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో మిథున్ మంజునాథ్ 21–17, 21–8తో జాసన్ గునవాన్ (కెనడా)పై, శంకర్ ముత్తుస్వామి 21–14, 21–17తో లియోంగ్ జున్ హో (మలేసియా)పై గెలిచారు.
సమీర్ వర్మ 14–21, 18–21తో అంగుస్ ఎంగ్ కా లాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడగా, లీ లాన్ జీ (చైనా) తో జరిగిన మ్యాచ్‌లో స్కోరు 17–21 ఉన్న దశలో కిరణ్ జార్జ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. విమెన్స్ సింగిల్స్‌లో మాళవిక బన్సద్ 22–20, 21–8తో లుసియా కాస్టిలో సలాజర్ (పెరూ)పై, అష్మితా 21–10, 21–16తో వాంగ్ లింగ్ చియాంగ్ (మలేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.