సంక్షోభంలో శ్రీలంక : ప్రజలకు టీ, బన్నులుఅందిస్తున్న మాజీ క్రికెటర్

సంక్షోభంలో శ్రీలంక : ప్రజలకు టీ, బన్నులుఅందిస్తున్న మాజీ క్రికెటర్

శ్రీలంక తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2 కోట్ల జనాభా ఉన్న ఈ ద్వీపదేశం రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో తల్లడిల్లుతోంది. ప్రత్యేకంగా ఆహారం, ఔషధాలు, ఇంధనం దొరకక నానాతంటాలు పడుతున్నారు అక్కడి ప్రజలు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్, మాజీ కోచ్ అయిన రోషన్ మహానామా అక్కడి ప్రజలకు తనవంతు సాయం అందిస్తున్నాడు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లో ఉన్న ప్రజలకు టీ, బన్నులు అందించి మానవత్వం చాటుకున్నాడు. అయితే వీటి కోసం రోజురోజుకు క్యూలైన్లు పెరిగుతున్నాయని..అది తనను మరింత బాధ పెట్టిందని రోషన్ చెప్పాడు. ప్రజలు గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోవడం వల్ల అనారోగ్యం పాలవుతన్నారని ట్వీట్ చేశారు. కాగా 1996 లో ప్రపంచకప్ సాధించిన జట్టులో రోషన్ కూడా ఉన్నాడు.

మరోవైపు పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న ఇంధన నిల్వలను సంరక్షించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రెండువారాల పాటు ప్రభుత్వసంస్థలు, పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక ఏప్రిల్ లో శ్రీలంక 51బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని చేతులెత్తేసింది.