తెలంగాణలో 'శ్రీమద్ భాగవతం' షూటింగ్.. హైదరాబాద్‌ను హాలీవుడ్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణలో 'శ్రీమద్ భాగవతం' షూటింగ్..  హైదరాబాద్‌ను హాలీవుడ్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(  Revanth Reddy ) సినీ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా, భవిష్యత్తులో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కూడా తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలన్న లక్ష్యంతో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌లో సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చాప్టర్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ విజన్‌కు తగ్గట్టే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'రామాయణం' ( Ramayan )  సీరియల్‌ను నిర్మించిన సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెరకెక్కించనున్న "శ్రీమద్ భాగవతం" పార్ట్ -1 ( Srimad Bhagavatam ) సినిమా ముహూర్తపు సన్నివేశాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాప్ కొట్టి ఘనంగా ప్రారంభించారు.  రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితంలో, సంస్కృతిలో ఒక భాగం. అలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తెరకెక్కించడం అందరికీ గొప్ప ప్రేరణను ఇస్తుందన్నారు. భారతీయ వసుదైక కుటుంబం గురించి ఒక భావన కల్పించడానికి శ్రీమద్ భాగవతం (పార్ట్ -1) సినిమాను తెరకెక్కిస్తున్న సాగర్ పిక్చర్స్ సంస్థకు అభినందనలు తెలిపారు.

Also Read:-రూ 4వేల కోట్ల మెగా బడ్జెట్‌తో ' రామాయణం'.. చరిత్ర సృష్టించనున్న నితీష్ తివారీ!

40 ఏళ్ల కిందట రామానంద సాగర్ నిర్మించిన 'రామాయణం' సీరియల్ దూరదర్శన్‌లో వస్తుందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండేవని గుర్తుచేశారు. కోవిడ్ సమయంలోనూ మరోసారి 'రామాయణం' ప్రసారం చేసి ప్రపంచ రికార్డును సృష్టించిందని తెలిపారు. ఇప్పుడు మూడో తరం వారు 'శ్రీమద్ భాగవతం'ను సినిమాగా తెరకెక్కిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ సినిమా విజయవంతమై, రానున్న రోజుల్లో 'రామాయణం' సీరియల్‌ను మించి రికార్డు సృష్టించి, దేశంలోనే అద్భుతమైన సినిమాగా రాణించాలని ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

"ప్రతిష్టాత్మక చిత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించడం సంతోషకరం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే ప్రత్యేకమైన ఈ స్టూడియో ఇక్కడ ఉండటం తెలంగాణకు గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ స్ఫూర్తిగా ప్రణాళికలు రచిస్తున్నాం" అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణను గ్లోబల్ సినీ పవర్‌హౌస్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ చెరుకూరి విజయేశ్వరి, ఈనాడు సంస్థల ఎండీ చెరుకూరి కిరణ్ తో పాటు సాగర్ పిక్చర్స్ ప్రతినిధులు ఆకాశ్ మోతీ సాగర్, అమృత్ సాగర్, సీఈవో అకాశ్ సాగర్ చోప్రా, నటీనటులు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.