అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు: మంత్రి  శ్రీనివాస్​గౌడ్

అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు: మంత్రి  శ్రీనివాస్​గౌడ్

నారాయణపేట,వెలుగు: అధికారులు నిర్లక్ష్యం వీడి, ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని  రాష్ట్ర ఎక్సైజ్​శాఖ మంత్రి  శ్రీనివాస్​గౌడ్​ ఆదేశించారు. శనివారం నారాయణపేట జడ్పీ చైర్​పర్సన్​ వనజమ్మ​  అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. హాజరైన మంత్రి మాట్లాడుతూ  సమావేశాల్లో సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను ప్రశ్నించడం, నిలదీయడమే కాకుండా సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందరికీ అందే విధంగా సమన్వయంతో పనిచేయాలని, ఏ సమస్యలు లేని మండలాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. త్వరలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్, ఎస్పీ, మెడికల్  కాలేజీ బిల్డింగ్​ ప్రారంభించేందుకు రానుండడంతో  జడ్పీ ఆఫీస్​ బిల్డింగ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునేందుకు స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరందించేందుకు త్వరలో ఒక  మెగా ప్లాన్​ తయారు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అగ్రికల్చర్​ ఆఫీసర్​ను  ఆదేశించారు.  కేంద్రం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం ప్రారంభించిందని కేసీఆర్​ ఉన్నంత వరకు తెలంగాణలో ఉచిత విద్యుత్​ ఇస్తామని మంత్రి చెప్పారు. 

అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వొద్దు

వ్యవసాయశాఖ అంశంపై జరిగిన చర్చలో  ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి మాట్లాడుతూ ఎజెండాలో తప్పుడు సమాచారం ఇచ్చి ఆఫీసర్లు  తప్పుదోవ పట్టించొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్​సమ్మాన్​కింద 2019 నుంచి రూ.205 కోట్లు ఇస్తే రాష్ట్రం ఇప్పటి వరకు జిల్లాలోనే రూ.2,000 కోట్లు ఇచ్చిందన్నారు. పూర్తి సమాచారం ఇస్తే బీజేపీ అసమర్ధత సభ్యులకు తెలుస్తుందన్నారు. నకిలీ సీడ్స్, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నా..  అధికారులు పట్టించుకుంటలేరని ఊట్కూర్​ జడ్పీటీసీ  అశోక్ సభ దృష్టికి తీసుకురాగా.. చర్యలు తీసుకుంటున్నామని  అగ్రికల్చర్​ఆఫీసర్​ జాన్ ​సుధాకర్​ తెలిపారు. సబ్సిడీపై సీడ్స్, యంత్రాలు ఏమయ్యాయని, రైతు రుణమాఫి చేస్తలేరని మద్దూర్​ జడ్పీటీసీ ప్రశ్నించగా అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఏఈవోలు క్షేత్రస్థాయిలో పనిచేస్తలేరని కోస్గి జడ్పీటీసీ ప్రకాశ్​రెడ్డి ఆరోపించారు.  

విద్యుత్​శాఖ అధికారులపై ఎమ్మెల్యే సీరియస్​

  కొల్లంపల్లి, వెంకటాపూర్​, గున్ముక్ల సబ్​స్టేషన్​లు పూర్తయినా 5 ఏళ్ల నుంచి ఎందుకు ప్రారంభిస్తలేరని ఏడీపై ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి సీరియస్​అయ్యారు. ఇవి ప్రారంభం కాకపోతే జిల్లాలో ఎస్ఈ ఆఫీస్​ ఎలా ప్రారంభిస్తారో?  ఎస్ఈ ఇక్కడ ఎలా కూర్చుంటాడో చూస్తానన్నారు. జిల్లాలో ఫుల్​టైం డీఈవో లేనందున ఇక్కడ విద్యాశాఖ పరిస్థితి అధ్వానంగా తయారైందని ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి అన్నారు. ఎజెండాలో స్కూళ్ల సంఖ్య వివరాలు కూడా తప్పుగా ఇస్తున్నారని వాపోయారు.   మాగనూరు పీహెచ్​సీలో డాక్టర్లు లేరని ఎంపీపీ, జడ్పీటీసీ సభకు వివరించారు. 30 మంది డాక్టర్లు త్వరలో జాయిన్​అవుతారని ఎమ్మెల్యేఈ సందర్భంగా  చెప్పారు.  మిషన్​భగీరథ పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని దామరగిద్ద మండలంలో పైప్​లైన్​ ఎందుకు పెండింగ్​ ఉందని, మరికల్​మండలంలో నీళ్లు ఎందుకు సరఫరా చేస్తలేరని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు.  మక్తల్​నుంచి నారాయణపేట రోడ్డు అధ్వానంగా తయారైందని సీరియస్​అయ్యారు. దామరగిద్ద రోడ్డు పూర్తి చేయలేదని ఎంపీపీ నర్సప్ప అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఆఫీసర్​కు ఎంపీపీకి  కొద్ది సేపు వాగ్వాదం జరగగా కలెక్టర్​  శ్రీహర్ష కలుగజేసుకుని సమస్యను  పరిష్కరిస్తానని 
హామీ ఇచ్చారు. 

ప్రొటోకాల్​ పాటిస్తలేరు..

 ఆఫీసర్లు ప్రొటోకాల్​ పాటిస్తలేరని, ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారని  మద్దూర్ జడ్పీటీసీ కలెక్టర్​ దృష్టికి తెచ్చారు.  ప్రతి జడ్పీ మీటింగ్​లో మినిట్స్​ ఎందుకు ఇవ్వటం లేదని ఎమ్మెల్యే ఎస్ఆర్​ రెడ్డి జడ్పీ సీఈవోను ప్రశ్నించారు.  ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి, కలెక్టర్​ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ మియాంక్​ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.