
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లాయర్ శ్రీనివాస్ ఎంక్వైరీ ముగిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. సింహయాజీకి ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ సహా పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. సింహయాజీ స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలుపై శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నించారు. అక్టోబర్ 26వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు స్వామికి టికెట్స్ ఎందుకు బుక్ చేశారని ఆరా తీశారు. శ్రీనివాస్ కాల్ డేటా వాట్సాప్ మెసెజ్‌లను చూపిస్తూ.. ప్రశ్నించారు. సింహయాజీ స్వామితో హోమం, కొన్ని పూజలు చేపించడానికి మాత్రమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశామని శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. ప్రలోభాలకు సంబంధించి తనకు అసలు సమాచారం లేదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని శ్రీనివాస్‌కు సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి శ్రీనివాస్‌ను పంపించారు. ఇక విచారణకు హాజరుకాని బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలపై సిట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. విచారణకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. రేపు హైకోర్టు విచారణ అనంతరం సిట్ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.