ఫాంహౌస్ కేసులో కుట్రపూరితంగా ఇరికించారు : శ్రీనివాస్ తరఫు లాయర్

ఫాంహౌస్ కేసులో కుట్రపూరితంగా ఇరికించారు : శ్రీనివాస్ తరఫు లాయర్

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో హైకోర్టు విచారణ కొనసాగుతోంది. కేసులో ఏ7గా ఉన్న శ్రీనివాస్ తరఫు న్యాయవాది ఉదయ్ హుల్లా ఇవాళ వాదనలు వినిపించారు. శ్రీనివాస్ను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఫాంహౌస్ వ్యవహారంతో సంబంధం లేనప్పటికీ ఆయన సిట్ విచారణకు హాజరయ్యారని చెప్పారు.

సిట్ విచారణ ఎలా జరిగిందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని శ్రీనివాస్ తరఫు లాయర్ ఉదయ్ హుల్లా కోర్టుకు తెలిపారు. కేవలం ఒక్క ఫొటోను ఆధారంగా చేసుకుని తన క్లయింట్ను కేసులో ఏ7గా చేర్చడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులను సైతం సిట్ అధికారులు వేధించారన్న హుల్లా..  ఈ కేసు విషయంలో మీడియా ట్రయల్ నడుస్తోందని అన్నారు. కేసు దర్యాప్తునకు సంబంధించి మీడియాకు ముందే లీకులిస్తున్నారని న్యాయమూర్తికి విన్నవించారు. మధ్యాహ్నం తర్వాత సిట్ వాదనలు వినిపించే అవకాశముంది.