‘హలో శ్రీనివాస్.. చలో కరీంనగర్’ ..ఈనెల 26న గ్రూపు రెండో వార్షికోత్సవానికి సిద్ధం

‘హలో శ్రీనివాస్.. చలో కరీంనగర్’ ..ఈనెల 26న గ్రూపు రెండో వార్షికోత్సవానికి సిద్ధం
  • ఒకే వేదికపైకి చేరి ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నాలు 
  • దేశ, విదేశాల నుంచి ఈవెంట్ కు రావాలని ప్రచారం 
  • తలసేమియా బాధితుల కోసం భారీ బ్లడ్ డొనేషన్ క్యాంపు

కరీంనగర్, వెలుగు :శ్రీనివాస్ అనే పేరున్న వారు మరోసారికరీంనగర్ కేంద్రంగా కలుసుకోబోతున్నారు. సేవా భావం, ఆధ్యాత్మికత అనే ట్యాగ్ లైన్ తో రెండేళ్ల కింద ఏర్పడిన ‘ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ’ ఈ నెల 26న రెండో వార్షికోత్సవానికి సిద్ధమైంది. నిరుడు సెప్టెంబర్ చివరివారంలో వందల్లో కలుసుకున్న శ్రీనివాసులు.. ఈసారి వేలాదిగా ఒక్కచోట చేరబోతున్నారు. సోషల్ మీడియాలో ‘హలో శ్రీనివాస్.. చలో కరీంనగర్’ పిలుపు ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. 

23 వేలకు చేరిన సభ్యులు
 
కరీంనగర్ కు చెందిన వూటుకూరి శ్రీనివాస్‌‌రెడ్డి తొలుత 2023 అక్టోబరు 29న ‘మనమంతా శ్రీనివాసులమే’ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి రెండేళ్లుగా సభ్యులను ఒక్కటి చేశారు. అందులో ఒకరి నుంచి మరొక రిని కలుస్తూ, ఫోన్ లో సంప్రదిస్తూ వాట్సప్ గ్రూపుల్లో యాడ్ చేస్తూ పోయారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ వరకు శ్రీనివాస్‌‌ అనే పేరున్నవారిని 6,580 మంది వాట్సప్ గ్రూపులో చేర్చారు. ఆ తర్వాత ‘ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ’ను ఏర్పాటు చేసి తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ప్రస్తుతం 28 వాట్సప్‌‌ గ్రూపుల్లో శ్రీనివాసుల సంఖ్య సుమారు 23 వేలకు చేరింది.  

రికార్డు నెలకొల్పే దిశగా అడుగులు.. 

తెలంగాణ శ్రీనివాసుల సంస్థగా ఏర్పడ్డాక.. తలసేమియా బాధితుల కోసం పలుమార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మెగా రక్తదాన శిబిరంలో సుమారు 700 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ క్రమంలోనే రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర నలుమూలలతోపాటు దేశ, విదేశాల నుంచి శ్రీనివాసులను ఒక్క చోట చేర్చి రికార్డు నెలకొల్పాలనే సంకల్పంతో సంస్థ నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. 

2024 అక్టోబర్ 27న కరీంనగర్‌‌లోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన తొలి వార్షికోత్సవానికి 760 మంది సభ్యులు హాజరయ్యారు. ఈసారి ఈనెల 26న నిర్వహించే రెండో వార్షికోత్సవానికి వేలాది మంది వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఒకే పేరున్న వేలాది మంది ఓకే చోట కలిసి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని 
నిర్ణయించారు.  

 సేవ చేయాలనే సంకల్పంతోనే.. 

శ్రీనివాసుల సేవా సంస్థ గ్రూపునకు స్పందన విశేషంగా ఉంది. తొలి ఏడాదిలోనే 6 వేల మంది ఉంటే.. ఇప్పుడు 23 వేల మందికి చేరింది. ఇంకా వేలల్లో వస్తారని భావిస్తున్నాం. ఈ సందర్భంగా తలసేమియా బాధితుల కోసం భారీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయబోతున్నాం. శ్రీనివాస్‌‌  పేరు ప్రాధాన్యాన్ని తెలియజెప్పడం మా బాధ్యతగా భావిస్తున్నాం. ఈ సంకల్పంతోనే  అందరం ఒకచోట చేరి సేవా, సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నామని శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్  వూటుకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.