
హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ వెహికల్ ఫైనాన్షియర్ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌టీఎఫ్‌సీ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌సీయుఎఫ్), ప్రమోటర్ సంస్థ శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్ (ఎస్‌సీఎల్)లు ఒకే కంపెనీగా మారాయి. ఈ మూడింటినీ కలిపేందుకు సంబంధిత డైరెక్టర్లు అంగీకరించారు. కొత్త కంపెనీని శ్రీరామ్ ఫైనాన్స్‌గా వ్యవహరిస్తారు. ఈ విలీనానికి సంబంధిత కంపెనీల షేర్‌హోల్డర్లు, ఆర్‌బీఐ, సీసీఐ, ఐఆర్‌డీఏ, ఎన్‌హెచ్‌బీ, ఎన్‌సీఎల్‌టీ వంటి రెగ్యులేటర్ల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ విలీన ఒప్పందం ప్రకారం ప్రతి ఎస్‌సీయుఎఫ్ షేర్‌కూ 1.55 షేర్ల చొప్పున శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ జారీ చేయనుండగా, ఎస్‌సీఎల్ ప్రతి షేర్‌కూ 0.09783305 షేర్లను జారీ చేయనుంది. ఈ విలీనంతో కమర్షియల్, టూవీలర్, గోల్డ్, పర్సనల్, ఆటో లోన్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ క్యాపిటల్ ఎండీ డీవీ రవి, మాట్లాడుతూ ‘‘విలీనం వల్ల మేం దేశంలో అతిపెద్ద రిటైల్ ఫైనాన్స్ ఎన్‌బీఎఫ్‌సీగా ఎదిగాం. మా గ్రూపులోని అన్ని వ్యాపారాలనూ ఎలాంటి అదనపు పెట్టుబడులు లేకుండా విస్తరించడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.