
- బయటికి పంపింది 74.27 టీఎంసీలు
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. వానాకాలం ప్రారంభంలో డెడ్ స్టోరేజీకి చేరడంతో అన్నదాతల్లో నైరాశ్యం నెలకొంది. నాట్లు వేసిన అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూశారు. జూన్ ప్రారంభంలో 672 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు లో 1062.20 అడుగులు, 12.58 టీఎంసీల నీరు ఉంది. జూన్ 1న గత ఏడాది అదే సమయంలో ప్రాజెక్టు లో 1056.10 అడుగులు, 7.33 టీఎంసీల నీటితో డెడ్ స్టోరేజీ కి చేరింది. ప్రాజెక్టు లో డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు కాగా, ఈ వానాకాలంలో 12 టీఎంసీల నీటి మట్టానికి చేరడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందారు. జూన్ చివరినాటికి ఎగువ నుంచి 4.74 టీఎంసీల నీరు వచ్చింది. జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తే సమయానికి ప్రాజెక్టులో 28.97 టీఎంసీలకు నీరు చేరడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
సాగునీటి కోసం శివం మీటింగ్ నిర్వహించి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు లో 51 టీఎంసీల నీరు ఉంటేనే కాల్వలకు నీటి విడుదలకు అవకాశం ఉందని చెప్పిన అధికారులు రైతులు అవసరాల దృష్ట్యా నీటి విడుదల చేపట్టారు. 46.58 టీఎంసీల నీరు ఉండగా, ప్రధాన కాల్వలకు నీటి విడుదల చేపట్టారు. ఆగస్టు 12 నుంచి ఎగువ నుంచి వరదలు రావడంతో నీటి మట్టం పెరిగింది.17న ప్రాజెక్టుకు లక్షా 50వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు నుంచి 9 గేట్లు ఎత్తి గోదావరిలోకి 25వేల క్యూసెక్కుల మిగులు జలాలు వదిలారు. ఎగువ గోదావరి బేసిన్ లో కురుస్తున్న
వర్షాలతో 26 గేట్లకు పెంచారు. తర్వాత 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ఉధృతి పెరగడంతో 40 గేట్లు ఎత్తి 3 లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం 54187 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ ఆఫీసర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1090.90 అడుగులు, 80.05 టీఎంసీలకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు లో 1082.10 అడుగులు, 51.02 టీఎంసీల నీరు ఉంది.కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల..శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి వచ్చే వరదలతో ప్రధాన కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. వరద కెనాల్ కు 2వేల క్యూసెక్కులు, కాకతీయ కు 3500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లకు 4500 క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్ కు 500, లక్ష్మీ కెనాల్ ద్వారా 150 క్యూసెక్కుల నీటి సరఫరా చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో కరెంట్ ఉత్పత్తి..
కాకతీయ, ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదల చేపడుతున్నాం. ప్రాజెక్టు దిగువ జలవిద్యుత్ కేంద్రంలోని 4 టార్భాయిన్ల ద్వారా రికార్డు స్థాయిలో సామర్థ్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. నాలుగు యూనిట్ల తో 36 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తి కాగా, ప్రస్తుతం 36.50 మెగావాట్లతో లక్ష్యానికి మించి కరెంట్ జనరేట్ అవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9.84 మిలియన్ యూనిట్ ఉత్పత్తి అవుతోంది. - శ్రీనివాస్, జేన్ కో డీఈ