శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత
  • రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభించిన అధికారులు

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. కొద్దిసేపటి క్రితం రెండు గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటి విడుదల ప్రారంభించారు. ఎగువన కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో కొద్ది రోజుల్లోనే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. బుధవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. కొద్దిసేపటి తర్వాత మరో గేటు ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు. వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ క్రమంగా పదిగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. జులై నెలలోనే శ్రీశైలం డ్యామ్ నిండడం అనేది 2007 తర్వాత మళ్లీ ఇప్పుడేనని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ కు ఎగువన జూరాల నుండి 4 లక్షల 65 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ఈ సీజన్లో గరిష్ట స్థాయి వరదతో కృష్ణానది పొటెత్తుతోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 882 అడుగులతో 190టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతిని బట్టి రేపు ఉదయంలోగా మరికొన్ని గేట్లు తెరిచే అవకాశం కనిపిస్తోంది. 
కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
శ్రీశైలం జలాశయం నిండిపోయి గేట్లు ఎత్తడంతో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వమే ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేదు. ఎట్టకేలకు ఇవాళ నీటి విడుదల ప్రారంభించిన వెంటనే ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు తెలిపారు. నీటి విడుదల పెంచే కొద్ది విద్యుత్ ఉత్పత్తిని కూడా అదే స్థాయిలో చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 35 వేల 315 క్యూసెక్కుల వరద విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా.. తెలంగాణ ఆధీనంలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 356 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

కృష్ణమ్మకు పూజలు..జలహారతి
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో సాయంత్రం డ్యామ్ గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడానికి ముందు కృష్ణానదికి శ్రీశైలం దేవస్థానం వేద పండితులు, పూజారుల ఆధ్వర్యంలో పూజలు చేసి జల హారతి ఇచ్చారు. దేవస్థానం తరపున ఈవో కేఎస్ రామారావు, వేద పండితులు హాజరై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా కృష్ణమ్మకు సారే, రవిక, పసుపు కుంకుమను సమర్పించారు. డ్యామ్ గేట్లు ఎత్తుతున్నట్లు ముందే అధికారులు అప్రమత్తం చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జనం భారీగా తరలివచ్చారు.