పర్యాటకులను కనువిందు చేస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్రోన్ దృశ్యాలు

పర్యాటకులను కనువిందు చేస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు డ్రోన్ దృశ్యాలు

శ్రీశైలం ప్రాజెక్టు అందాలు కనువిందు చేస్తున్నాయి. 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో.. డ్యామ్ అందాలు ఆకర్షి్స్తున్నాయి.  కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు రెండు కన్నులూ చాలడం లేదు. ఈ  సుందర దశ్యాలను ఆకాశంపై నుంచి చూస్తే..అద్భుతం..మహా అద్భుతం. ప్రకృతి ఒడిలో పరుగులు పెడుతున్న కృష్ణానది డ్రోన్ విజువల్స్ మీరు చూడండి..

ఉప్పొంగిన కష్ణమ్మ..
ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. పైన ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి  లక్షా 47వేల 405 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకలి వస్తుండగా..2 లక్షల 5వేల 432 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885.80 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.5 అడుగు ల వరకు నీరుంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం 212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

పర్యాటకుల తాకిడి..
శ్రీశైలం గేట్లు ఎత్తారన్న సమాచారంతో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ నుంచి  పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. దీనికి తోడు శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తారు.