
హైదరాబాద్: సృష్టి అక్రమ సరోగసీ, ఐవీఎఫ్,శిశువుల కొనుగోలు కేసులో అరెస్టైన డాక్టర్నమ్రత ఐదు రోజుల కస్టడీలో పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. పిల్లల్ని అమ్మే గ్యాంగులతో కూడా డాక్టర్ నమ్రతకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలతో నమ్రతకు లింకులు ఉన్నాయి. పిల్లల్ని కొని అమ్ముతున్న నందిని, హర్ష, పవన్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల కస్టడీలో వెల్లడైంది.
గతంలోనూ పిల్లల్ని అమ్ముతూ నందిని ,హర్ష, పవన్ అరెస్ట్ కావడం గమనార్హం. ఒక్కొక్క పిల్లాడిని 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి డాక్టర్ నమ్రత కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగోసి వైపు మళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు కస్టడీలో నమ్రత నిజం బయటపెట్టింది. నందిని, హర్ష, పవన్.. కలిసి కొన్ని ఏళ్ల నుంచి పిల్లల్ని అమ్ముతున్న గ్యాంగ్గా ఏర్పడ్డారు. హైదరాబాద్లో మరొక నాలుగు సెంటర్లకు కూడా పిల్లల్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు.
పెట్టీ కేర్, హెడ్జ్ ,ఒయాసిస్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లకు పిల్లలను అమ్మినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్న పలు ఫెర్టిలిటీ సెంటర్లతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయి. పిల్లల అమ్మకాలతో పాటు యువతి, యువకులను ఈ గ్యాంగ్ ట్రాప్ చేసింది. యువతి, యువకుల వీర్యకణాలు, అండాలను సేకరించి అమ్ముకుంది. డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్కు డబ్బులు ముట్ట జెప్పినట్లు కస్టడీలో బయటపడింది. డాక్టర్ సదానందం సృష్టి కేసులో కీలక పాత్ర పోషించినట్లు కూడా వెల్లడైంది. గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్గా సదానందం కొనసాగుతున్నాడు. ప్రతి ఆపరేషన్ వెనుక సదానందం పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.