పులి నోట్లో నుంచి బయటపడిన చిన్నారి.. కోలుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నాడు

పులి నోట్లో నుంచి బయటపడిన చిన్నారి.. కోలుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నాడు

తిరుమల నడకమార్గంలో అలిపిరి వద్ద 14 రోజుల క్రితం చిరుత దాడిలో గాయపడి.. చికిత్స పొందిన చిన్నారి కౌశిక్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.  ఆ చిన్నారిని శ్రీ వేంకటేశ్వరుడే కాపాడాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

 జూన్‌ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరగగా.. వెంటనే స్పందిచిన  టీటీడీ అధికారులు శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. పులిబారినుంచి బయటపడిన చిన్నారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చిన్నారి కౌశిక్  కుటుంబసభ్యులకు టీటీడీ సిబ్బంది ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.  ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో బాలుడికి చికిత్స జరిగింది.  ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.  అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. నడకమార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని తెలియజేశారు.

ALSO READ :ఈ తల్లి కష్టాలు.. పగోళ్లకు కూడా వద్దు.. ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో స్టీరింగ్

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బాలుడి తల్లిదండ్రులు  బి.పులికొండ,  బి.శిరీష మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే తమ బిడ్డ ప్రాణాలతో దక్కాడని సంతోషం వ్యక్తం చేశారు . స్వామి వారికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. అలాగే చిరుత దాడిలో తమ బిడ్డ గాయపడగా..  ఘటన జరిగిన  15 నిమిషాల్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితోపాటు ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని... తమ బిడ్డను చిన్నపిల్లల అసుపత్రికి తరలించి కాపాడినందుకు .. వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు . వైద్యులు ఎంతో ఓపికగా మెరుగైన వైద్యం ఉచితంగా అందించి పూర్తి ఆరోగ్యంతో తమ బిడ్డను తిరిగి అప్పగించారన్నారు  కౌశిక్ తల్లిదండ్రులు.