సార్.. నాణ్యమైన భోజనం పెట్టండి..బోథ్ ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన

సార్.. నాణ్యమైన భోజనం పెట్టండి..బోథ్ ఎస్టీ హాస్టల్ విద్యార్థుల ఆందోళన

బోథ్, వెలుగు: ‘మాకు నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతున్నరు.. అడిగితే బెదిరిస్తున్నరు.. మాకు నాణ్యమైన భోజనం పెట్టండి సార్’​ అంటూ బోథ్​మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్​విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది మంచి భోజనం పెట్టడం లేదని గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ  అధికారులు తమను పట్టించుకోవడం లేదన్నారు.

నీళ్ల పప్పు, ఉడకని అన్నం పెడుతున్నారని, అన్నంలో పురుగులు వస్తే తీసేసి తినాలని నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఆహారం గురించి ప్రశ్నిస్తే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టేలా చూడాలని అధికారులను కోరారు. విషయం తెలుసుకున్న ఏఐఎస్​ఎఫ్ విద్యార్థి నాయకులు హాస్టల్​కు వెళ్లారు. భోజన నాణ్యతపై అధికారులు విచారణ చేపట్టాలని, హాస్టల్​ఇన్​చార్జ్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు.