
- స్మార్ట్ డస్ట్ బిన్ల నుంచి చెత్త తీసుకుపోని సిబ్బంది.. ఓవర్ ఫ్లో అవుతున్నదని బోర్లా
- పక్కన పడేసి పోతున్న జనాలు
- మిగతా ప్రాంతాల్లోనూ పేరుకుపోతున్న చెత్తకుప్పలు
- రాంకీ సంస్థ, బల్దియా నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
- వాహనాలు, సిబ్బంది సరిపోవడం లేదంటున్న స్టాఫ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : మహానగరంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చెత్త సమస్య మాత్రం తీరడం లేదు. పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నా, టెక్నాలజీని వాడుకుంటున్నా చెత్త ఇష్యూ మాత్రం నగరవాసులను ఇబ్బంది పెడుతూనే ఉన్నది. డస్ట్‌బిన్ లెస్ సిటీగా మార్చడానికి పాత చెత్త డబ్బాలు ఎత్తేసి స్మార్ట్ డస్ట్బిన్లు తీసుకువచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. చెత్త నిండగానే అలారం మోగినా తరలించే వారు రావడం లేదు. దీంతో వాటి నుంచి చెత్త ఓవర్ ఫ్లో అయితే, ఎందుకీ తలనొప్పి అనుకుంటూ కొన్ని చోట్ల బోర్లా పడేసి పోతున్నారు. దీంతో జనాలు చెత్తను ఆ డబ్బాల పక్కన పడేసి పోతున్నారు. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. స్మార్ట్ డస్ట్బిన్లు ఉన్నచోటే కాకుండా దాదాపు సిటీ అంతా ఈ సమస్య పీడిస్తున్నది.
ఫలితాన్నివ్వని డస్ట్‌బిన్ లెస్ కాన్సెప్ట్
నగరాన్ని చెత్త డబ్బాలు లేని సిటీగా మార్చడానికి నాలుగేండ్ల క్రితం అధికారులు డస్ట్ బిన్ లెస్ సిటీ కాన్సెప్ట్తీసుకువచ్చారు. ఇందులో భాగంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్తడబ్బాలు తొలగించారు. అయితే, చెత్త డబ్బాలు లేకపోయినా జనాలు అవే ప్రాంతాల్లో చెత్త వేయడం మొదలుపెట్టారు. దీంతో చెత్త వేసిన వారికి ఫైన్లు విధించడంతో పాటు అవేర్నెస్కార్యక్రమాలు నిర్వహించారు. జీవీపీ(గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్) వద్ద షిఫ్ట్ ల వారీగా కార్మికులను కాపలా ఉంచారు. అయినా ఏ మార్పు కనిపించలేదు.
కుయ్ కుయ్మంటున్నా.. నయ్ నయ్..
ఎంత చేసినా జనాలు మళ్లీ చెత్తడబ్బాలు తీసేసిన ప్రాంతాల్లో చెత్త వేస్తుండడంతో కొన్ని నెలల కింద తిరిగి డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించారు. అయితే, ఈసారి టెక్నాలజీని వాడుకుంటూ మొదటి విడతలో 1000 స్మార్ట్డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఈ డస్ట్బిన్లకు అమర్చిన సెన్సార్‌వల్ల డబ్బాలో చెత్త నిండగానే చెత్త తీసుకువెళ్లే కంటైనర్వాహనానికి అలారమ్ వెళ్తుంది. దీంతో డబ్బా నిండిపోయిందని వెంటనే వచ్చి చెత్త తీసుకువెళ్తారని, ఇక సమస్య ఉండదని భావించారు. అయితే, ఇది కూడా వర్కవుట్‌కాలేదు. వెయ్యి చెత్తడబ్బాలకు బదులు 200 చోట్ల చెత్తడబ్బాలను ఏర్పాటు చేయగా, అవి నిండి కంటైనర్లలో అలారమ్ మోగుతున్నా వచ్చి తీసుకెళ్లడంలేదు. దీనిని పర్యవేక్షించేవారు లేకపోవడం, జనాలు చెత్త నిండిన స్మార్ట్డస్ట్బిన్ల పక్కన కూడా చెత్త వేస్తుండడంతో దుర్వాసన వస్తోంది. మెయిన్రోడ్డున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డస్ట్బిన్ల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది.
‘రాంకీ’ నిర్లక్ష్యంతోనే..
గ్రేటర్ లో ప్రస్తుతం రోజూ దాదాపు 7వేల టన్నుల చెత్త వస్తోంది. నగరంలో చెత్త సేకరణ నుంచి మొదలుపెడితే దాన్ని ప్లాంట్లకు తరలించడం, అక్కడ విచ్చిన్నం చేసేంత వరకు పూర్తి బాధ్యతలను రాంకీ అనే సంస్థకు 2009లో జీహెచ్ఎంసీ అప్పగించింది, ఇందుకుగాను టన్నుకి రూ.2 వేలు చెల్లిస్తోంది. అంటే రోజుకు కోటికిపైగానే కడుతోంది. 25 ఏండ్ల పాటు ఈ అగ్రిమెంట్ ఉంది. కానీ, చెత్త తరలింపు విషయంలో రాంకీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చెత్త తీయకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోయి కంపు కొడుతోంది. ఇక స్మార్ట్డస్ట్బిన్లు నిండిన తర్వాత ఆ చెత్తను కూడా తరలించే బాధ్యత రాంకీదే అయినా సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఒక కంటైనర్‌కు 25 స్మార్ట్డస్ట్బిన్లను కేటాయించగా, వీరంతా అనుకున్న టైంకు వచ్చి చెత్త తరలించడం లేదు.
మూడుసార్లు కాదు ఒక్కసారే..
సిటీ రోడ్లపై వేస్తున్న చెత్తను రాంకీ సంస్థ రోజుకు మూడుసార్లు తరలించాల్సి ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కంటైనర్లలో చెత్తను తరలిస్తున్నామని రాంకీ సంస్థతో పాటు బల్దియా చెబుతున్నా ఫీల్డ్‌లో పరిస్థితి వేరేలా ఉంది. చాలా ప్రాంతాల్లో రోజూ ఒక్కసారి మాత్రమే చెత్తను తీసుకువెళ్తున్నారని, కొన్నిచోట్ల రెండు, మూడు రోజుల వరకు కూడా చెత్త తీసుకువెళ్లడం లేదని స్థానికులు చెప్తున్నారు. స్మార్ట్ డస్ట్ బిన్లున్న చోట చెత్త నిండినప్పుడల్లా కంటైనర్‌లో అలారం మోగినా లెక్క చేయడం లేదు. పైగా, ఈ అలారం మోత తప్పించుకోవడానికి స్మార్ట్ డస్ట్బిన్లను బోర్లా వేసి పెడుతున్నారు. దీంతో జనాలు చెత్తను పక్కన పడేసి పోతున్నారు. తగినన్ని చెత్త వాహనాలు లేకపోవడం వల్ల చెత్త సమస్య ఏర్పడుతోందని, ఒక్కసారికే తమ వాహనాలన్నీ ఓవర్‌లోడ్ అవుతుంటే చెత్త ఎలా తరలిస్తామని సిబ్బంది అంటున్నారు. మరిన్ని చెత్త తరలింపు వాహనాలు, సిబ్బందిని పెంచితే సమస్య తగ్గుతుందని అంటున్నారు.