ఆపరేషన్ సిందూర్‎తో భారత ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది: మంత్రి రాజ్‎నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‎తో భారత ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది: మంత్రి రాజ్‎నాథ్ సింగ్

న్యూఢిల్లీ: బ్రహ్మోస్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ వంటి భారతదేశ స్వదేశీ పరికరాలు ఆపరేషన్ సిందూర్ సమయంలో సత్తా చూపించాయని.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇమేజ్ పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం (అక్టోబర్ 27) జరిగిన ఎస్ఐడీఎం వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్, ఆకాశ్ టీర్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ వంటి అనేక స్వదేశీ ఆయుధాలు  పరాక్రమం చూపించాయన్నారు.

 స్వదేశీ పరికరాలు సత్తా చాటడంతో ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతి పెరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయం మన సైనికులకే కాదని.. ఆ మిషన్‌ను విజయవంతం చేయడానికి వెనకుండి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరికీ కూడా క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. 

స్వదేశీ పరికరాల ఆవిష్కరణ, డిజైన్, తయారీ రంగాలలో అవిశ్రాంతంగా పనిచేసిన మీలాంటి పరిశ్రమ యోధులు సైనికులతో పాటు ఈ విజయానికి సమానంగా అర్హులని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏ పరిస్థితిలోనైనా మన సరిహద్దులను రక్షించుకోవడానికి భారత దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయనే విషయం స్పష్టమైందన్నారు.  పాకిస్తాన్‌తో పూర్తి స్థాయి యుద్ధానికి బలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలో అనిశ్చితి పెరిగిందని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని పేర్కొన్నారు.