నల్గొండ డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం !

నల్గొండ డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం !
  • పావులు కదుపుతున్న డైరెక్టర్లు
  • ఈనెల 10న టెస్కాబ్​చైర్మన్, వైస్​ చైర్మన్​పై అవిశ్వాసం
  • చైర్మన్​రేసులో ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి అనుచరుడు
  • డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్​రెడ్డి

నల్గొండ, వెలుగు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త, డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ ​కుంభం శ్రీనివాస్​రెడ్డిని చైర్మన్​గా ఎన్నుకునేందుకు తెరవెనక చర్చలు జరుగుతున్నాయి. మహేందర్​రెడ్డిని పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్​సీనియర్లు పథకం పన్నారు. 

రాజగోపాల్​రెడ్డి సూచన మేరకు శ్రీనివాస్​రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలిసింది. మొత్తం 19 మంది డైరెక్టర్లలో ప్రస్తుతం 12 మంది శ్రీనివాస్​రెడ్డికి మద్దతుగా నిలిచారు. సహకార సంఘం నిబంధనల ప్రకారం 2/3 వంతు మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపాలి. ఈ లెక్కన మరో ఇద్దరు డైరెక్టర్లు తోడైతే మహేందర్​రెడ్డిని పదవి నుంచి తప్పించడానికి మార్గం సుగమం కానుంది.

 మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సూచన మేరకు నల్గొండ, మునుగోడు, మిర్యాలగూడకు చెందిన డైరెక్టర్లు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలిసింది. వైస్ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​రెడ్డి సైతం అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కోమటిరెడ్డి బ్రదర్స్ విదేశీ పర్యటనలో ఉన్నందున వారు తిరిగి రాగానే అవిశ్వాస తీర్మానం లేఖను సహకారశాఖ అధికారులకు అందజేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి డీసీసీబీ పదవీకాలం ముగియనుంది. కొత్తగా ఏర్పడే పాలకవర్గం ఏడు మాసాలపాటు పవర్​లో ఉంటుంది.  

ఈనెల10న టెస్కాబ్​ పాలకవర్గంపై అవిశ్వాసం..

ఈనెల 10న టెస్కాబ్​ చైర్మన్, వైస్​ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ప్రస్తుతం చైర్మన్​కరీంనగర్​జిల్లాకు చెందిన కె.రవీందర్​రావు, వైస్​ చైర్మన్​గా గొంగడి మహేందర్​రెడ్డి ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరు చొప్పున 9 మంది డైరెక్టర్లు టెస్కాబ్​లో ఉన్నారు. చైర్మన్, వైస్​చైర్మన్​మినహాయిస్తే మిగితా ఏడుగురు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఈనెల 10న హైదరాబాద్​లోని టెస్కాబ్​లో అవిశ్వాసంపై మీటింగ్​జరగనుందని సహకారశాఖ అధికారులు తెలిపారు.