డిప్యూటీ ఈవో ఇంటర్వ్యూల పై పీటముడి..టీజీపీఎస్సీ, విద్యాశాఖ మధ్య సాగుతున్న పంచాయితీ

డిప్యూటీ ఈవో ఇంటర్వ్యూల పై పీటముడి..టీజీపీఎస్సీ, విద్యాశాఖ మధ్య సాగుతున్న పంచాయితీ
  •     ఇంటర్వ్యూలు పెడ్తామంటున్న కమిషన్.. నో అంటున్న విద్యాశాఖ 
  •     గ్రూప్-1కే ఎత్తేసిన్రు.. వీటికి ఎందుకని క్వశ్చన్​ 
  •     నిర్ణయం తేలక పోస్టుల భర్తీ ఆలస్యం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీ ఈవో) పోస్టుల భర్తీ ప్రక్రియలో కొత్త పీటముడి పడింది. ఇంటర్వ్యూల నిర్వహణ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), స్కూల్ ఎడ్యుకేషన్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ‘లొల్లి’ మొదలైంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తీరుతామని టీజీపీఎస్సీ పట్టుబడుతుండగా.. అత్యున్నతమైన గ్రూప్ పోస్టులకే ఇంటర్వ్యూలు రద్దు చేసినప్పుడు, ఈ పోస్టులకు ఎందుకని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

ఈ రెండు శాఖల మధ్య నలుగుతున్న ఈ పంచాయితీతో పోస్టుల భర్తీ ఆలస్యమవుతోంది. స్టేట్ లో 28 డిప్యూటీ డీఓ పోస్టుల భర్తీకి విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ పోస్టులతో పాటు డీఈడీ, బీఈడీ, ఎస్​సీఈఆర్టీలోని ఖాళీల భర్తీ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గతంలో టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు పంపించారు. 

రిజర్వేషన్లకు తగ్గట్టుగా రోస్టర్ పాయింట్లను ఇచ్చారు. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ అధికారులు.. డిప్యూటీఈఓ పోస్టులకు ఇంటర్వ్యూలు పెట్టాలనే ప్రతిపాదనను జీఏడీకి రాశారు. ఈ ప్రపోజల్​ను జీఏడీ అధికారులు.. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు పంపించారు. అయితే, గ్రూప్–1, గ్రూప్ 2 తదితర ప్రధానమైన పోస్టుల భర్తీలో పారదర్శకత కోసం గతంలోనే ఇంటర్వ్యూలను రద్దు చేశారు. కేవలం రాత పరీక్ష మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరుగుతున్నాయి. ఇప్పుడు డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించడం సరికాదని విద్యాశాఖ అధికారులు సర్కారుకు రిప్లై ఇచ్చారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు దాటింది. 

అయినా ఇప్పటికీ డిప్యూటీఈఓ పోస్టుల భర్తీపై టీజీపీఎస్సీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో కేవలం నలుగురు మాత్రమే రెగ్యులర్ డిప్యూటీఈఓలు ఉండగా, వారంతా ఇన్​చార్జీ డీఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. మరోపక్క, డిప్యూటీ ఈవో పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ గందరగోళం మొదలైంది. ఇంటర్వ్యూలు ఉంటాయా? ఉండవా? అనే స్పష్టత లేకపోవడంతో ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్రూప్–1 తరహాలోనే డిప్యూటీ ఈవోలకు కూడా ఇంటర్వ్యూలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.