చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడుకు ఏ మాత్రం అన్యాయం జరిగిన సహించబోమని.. తమ తఢాకా ఏంటో చూపిస్తామని మోడీ సర్కార్కు తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికిని నామమాత్రం చేసి ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ శక్తిని అసమానంగా పెంచితే భారీ ఆందోళనలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.
నియోజకవర్గాల పునర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీని గానీ, రాష్ట్రాన్ని గానీ సంప్రదించకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్ష పార్టీలతో చర్చించి తమ అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో అన్ని పార్టీల సభ్యులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
డీలిమిటేషన్ విషయంలో తమిళనాడుకు ఏ మాత్రం అన్యాయం జరిగిన రాష్ట్ర ప్రజలు పూర్తి శక్తితో నిరసన తెలియజేస్తారని.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా నా నాయకత్వంలో భారీ ఆందోళలను చేపట్టి రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కాగా, 2026-27 జనగణన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది.
జనాభా లెక్కల ఆధారంగా లేదా ప్రస్తుతం ఉన్న స్థానాలను 50 శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమకు తీరని అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనగణన లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభా నియంత్రణను సమర్ధవంతంగా అమలు చేసిన సౌత్ స్టేట్స్ పార్లమెంట్లో రాజకీయ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది.

