శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట .. ఐదుగురు భక్తులు మృతి

శ్రీకాకుళం కాశీబుగ్గ  వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ..  ఐదుగురు భక్తులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్న తిరుపతిగా పేరుగాంచిన  కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరం ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో  ఐదుగురు  భక్తులు చనిపోగా తొమ్మిది మందికి  గాయాలయ్యాయి. ఇవాళ  కార్తీక మాసం, ఏకదాశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.  ఈ క్రమంలో  క్యూ లైన్లలో  ఏర్పాటు చేసిన రెయిలింగ్   కిందపడటంతో  ఈ ఘటన జరిగింది.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై  ఆరాదీసిన ఏపీ సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం  చేశారు. దేవాలయానికి హుటాహుటిన బయలుదేరారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రి..గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.  

మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలను తరలించారు.  ఆలయ ప్రాంతంలో ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.
 

ఇది తిరుమల తిరుపతి దేవస్థానం  ఆలయం తరహాలో సువిశాలంగా, అత్యద్భుతమైన  శైలితో   నిర్మించారు.  తిరుమలలో తనివి తీరా దర్శనం లభించకపోవడంతో  హరిముకుంద పండా అనే భక్తుడు   తన సొంత ఖర్చుతో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ శ్రీవారి మూల విరాట్టుతో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల విగ్రహాలు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడి భారీ విగ్రహాలు కొలువుదీరాయి.