
- ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఏఐపీఈఎఫ్ లెటర్
హైదరాబాద్, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పవర్ ఇంజినీర్స్ అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆలిండియా పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్(ఏఐపీఈఎఫ్) లేఖ రాసింది. ఈ మేరకు దేశంలోని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ పార్టీకి అసోసియేషన్ ఆలిండియా చైర్మన్ శైలేంద్ర దూబే కృతజ్ఞతలు తెలిపారు. స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్‌గా సేవలందిస్తున్న సదానందంకు వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని ఖర్గేను కోరారు.
దేశవ్యాప్తంగా లక్ష మంది ఇంజినీర్లతో 50 ఏండ్ల క్రితం ఏఐపీఈఎఫ్ ఏర్పాటైందని, విద్యుత్ సంస్థల అభివృద్ధికి, ఇంజినీర్లు, వినియోగదారుల సమస్యలను పరిరక్షించేందుకు ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. ఏఐపీఈఎఫ్ అంతర్భాగమైన తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్‌గా సదానందం గత 20 ఏండ్లుగా వివిధ హోదాల్లో పనిచేశారన్నారు.
ఆరేళ్లు వరంగల్ లోక్‌సభ పరిధిలో పనిచేశారని గుర్తుచేశారు. ఎస్సీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అన్ని వర్గాల మద్దతుందన్నారు. లోక్‌సభ పరిధిలో విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు, సింగరేణి, ఆర్టీసీ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ల సపోర్ట్‌తో పాటు అన్ని వర్గాల మద్దతు ఆయనకుందన్నారు. సదానందంను బరిలోకి దింపితే విజయం ఖాయమని లేఖలో పేర్కొన్నారు.